పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభేదప్రాసము
ఉ. ముందుగ తావకీన హరిమోహనరూపము చూడలేదు నీ
వందుకు దేనె లుట్టిపడ నాడుచు నావిభుఁ డుప్పు లేక ము
ప్పందుము గంజి త్రాగునని పల్కెదుగా యెటులైన చూత మిం
కందఱిచేతనున్న మణికంకణమున్ గన నద్ద మేటికిన్. 337

క. నే వచ్చి చూచి మీ హరి
కీవలసినయేని డేగ నిచ్చెద బద మం
చావెలఁది మంత్రివర్యుని
భావంబు కళంకు దేర్పఁ బలికెన్ మగుడన్. 338

ఉ. నీవు మహానుభావుఁడవు నిన్నిటు నమ్మకయుంట గాదు నే
నావిభు జూచుముచ్చటల నాటకు దోడ్కొని వేడ్క మీఱఁగాఁ
బోవలె నంచు నిన్ను పొరపొచ్చెము లాడితి నింతెగాక యీ
భూవలయంబునందుఁ గడుపూజ్యులు మంత్రులు గారె యెంచఁగన్. 339

చ. అనవుడు మంత్రివర్యుఁడు ప్రియంబు నయంబును మీఱ నప్పు డా
వనితను దోడితెచ్చి యొకవంకను బూపొదచెంత వేడ్కతో
నునిచి నిజేశుఁ డున్నయెడ కొయ్యనఁ జేర నేగునంత న
య్యనఘుఁడు పచ్చఱాజగతియందుం గడు న్సుఖసుప్తుఁడౌ నెడన్. 340

ద్విరుక్తకందము
క. తళతళమను జెక్కులనెల
గలకలనగు ముద్దుమొకముఁ గవజక్కవలన్
దలతలమను వలిచన్నులు
కలిగిన యొకసకియ శౌరి గలలో గనియెన్. 341

తర్కము
చ. కలఁ గని లేచి తాఁగలికిఁ గాంచుట నిక్కమె యంచు నిక్కమై
వెలసినకాంత యెక్కడికి వేచనె నంచు నిదేమి చూడఁగా
గలయును గాదు నిక్కువముగా దిదియంచుఁ దలంచి యేక్రియన్
గలఁ గనుఁగొన్ననాతి బిగికౌఁగిట నుండెద నంచు నెంచుచున్. 342