పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. అనుచు సచివుఁ డిట్టు లాశౌరి ఘనతర
విభ్రమప్రతాపవిధులు దెలిపి
రమ్ము లెమ్ము తెమ్ము నెమ్మి డేగను గొని
చనఁగవలయు ననినఁ జాన యపుడు. 332

వ. అయ్యానందనిలయునియందు డెందం బానందంబునం బొందుపఱచి కురుపతి మనోన్నతి నతకరించి నరపతియగు తిరుపతివేంకటేశ్వరునియందుఁ గల కూరిమి పరుల కెఱుకపడకయుండునట్టుగా నుండియు మోహం బెచ్చరించి నిలుపోవక యతనివాక్యంబుల కుత్తరం బిచ్చుట కులకాంతధర్మంబు గాదనియు నూరకుండిన తిరస్కారంబై తోఁచుననియు విచారించి కించిద్దరహాసప్రతిశిరోల్లాసంబున నిజసఖీజనవితానము క్రేగంటఁ జూచి లజ్జాభరైకతానమతిఁ దా నతాననయై యూరకున్న నమ్మోహసంచారచారు నాంచారుదేవి యభిప్రాయం బెఱింగి. 333

అపూర్వప్రయోగము
గీ. తోడిచేడియలందుల రూఢికెక్క
నింగితాకారచేష్టల నెఱుగఁ నేర్చు
కనకమాలికయగు నొక్కకనకగంధి
సచివుఁ గనుఁగొనె దరహాసరుచులు మెఱయ. 334

క. అనియెఁ దనస్వామి కార్యం
బనుకూలము సేయ బొంకు టదియెల్లను మీ
కును సహజము పదివేలై
నను నమ్మఁగలేము దండనాయక నిన్నున్. 335

అపూర్వప్రయోగము
చ. జగతి నరుండు బొంకిన రసజ్ఞత దప్పు నకీర్తి జేకురున్
మొగసిరి బాయు నాపదలు ముంచు శుభంబు దొలంగు వీడు న
మ్మిగ జెడు ధర్మ మెల్లణఁగు మేలిమి నాశము నొందు నాయు వ
మ్మగు కలిదోషమందు భయ మంటదు నేస్తము బాయు సద్గతుల్. 336

వ. అదియునుం గాక.