పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ. చిల్కబాఱినవైపున జింకదాటు
పగది బంతియెగయుదారి పాపములకు
సరవి యంతరపల్లటి వరుస బిరుదు
పాత్రవలెనాడగల జిత్రపత్రమునకు. 181

ఉ. బంగరుజల్లులున్ బికిలి బంతితలాటము ముత్తియంబులున్
రంగుగ మోముపట్టు నపరంజిఖలీనము పట్టుపల్లమున్
సింగిణి విండ్లు తూణములు చిల్కల కోలలు పట్టియంబులున్
సంగతి పార్శ్వభాగముల జక్కఁగఁ బూనిచి సాది నిల్చినన్. 182

గీ. వాజిగుణమును రాగెయు వాగెభూమి
మానమును శరశస్త్రసంధానములును
జోడు పరశస్త్రముల రాక సూటివిధము
ననెడి యష్టావధానము లాత్మ నెఱిఁగి. 183

గీ. బిగువు పదిలంబు చూచి గంభీరవృత్తి
మ్రొక్కి పొన్నంకి వన్నియు ద్రొక్కి నిక్కి
సరవి కైరని నెక్కి యుత్సాహలీల
పిక్కటిల్లఁగ దుమికించి యెక్కువగను. 184

పంచధారాయుక్తసీసము
సీ. వలయాద్రి పరిమిత వసుమతి గైకొన్న
గమనిక చుట్టు వ్రేడెములు ద్రిప్పి
విరసించు నసురుల శిరముల మెట్టింతు
ననెడు చందముల జోడనలు బట్టి
నిజకీర్తిచంద్రికల్ నిగుడి యంబుధులెల్ల
గడచె నన్న విధాన నిడివి దోలి
యిలమీఁద తనయాజ్ఞ చెలియలికట్టగా
నిలిపినగతి కుఱుచలను మలచి
గీ. తనకు ప్రతిదేవుఁ డెందు లేఁడనుచు నెమకు
పగిది తగు నడ్డ వేడెము ల్బరపి మఱియు
భంజళి మురళి ఝళిపి ఝంపయి సుఢాల
మనఁ గతు లెసఁగఁ జూపుచు హాళిమీఱ. 185