పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

x


నడుమ నుండు శ్రీ పెరుంబూదూరు. వైష్ణవులకు ఉనికిపట్టు, శ్రీమద్రామానుజాచార్యులవారు జన్మించినచోటు; చెంజి (తుండిర) రాజ్యములోనిది. అంతటి అమాత్యుని కుమారుఁడు తమ రాజధానికి సమీపపుటూరిలోని సుప్రసిద్ధ పండితునికడ వట్టి విద్యాభ్యాసమే గాదు 'ఆంధ్ర కవిత'ను నేర్చుకొనుట ఏమాశ్చర్యము. పైగా నీతడు 'కర్ణాట తుండిర పాండ్యమండలాధీశ ప్రముఖాఖిల మహీమండలాఖండల దత్త వస్తువులు గలవాఁడు. అనఁగా పూర్తిగా మదరాసు నుండి రామేశ్వరము వఱకు నీతని విహారభూమి. రాజభోగములలో తేలుచుండినవాఁడు గాని సామాన్య గృహస్తుడుగాఁడు. కవిత చెప్పి ధనార్జన కుపక్రమింపవలసిన గ్రహచోర మీతనికి లేదు. ఈతఁడు కరణము (అనఁగా నియోగి.) కవిత్వ మీతనికొక ఉపకరణము. రాచకార్యములకు రాజులు ఇట్టి వారినే రాయబారులుగా, సాంధివిగ్రహికులుగా పంపెడివారు. శ్రీనాథుఁడు అట్టివాఁడే. ఈతని తిరుపతి వేంకటేశ్వర భక్తి ప్రాంతవర్ణనయు ఈ ప్రాంతము తోడి సన్నిహిత సంబంధమునకు మఱియొక సాక్ష్యము. ఇదంతయు చూడగా, నీ కవి యొక్క పెద్దలు ఎక్కడివారై యుండినను, ఇతడు మాత్రము దాక్షిణాత్యుఁడనియే చెప్పవలెను.


3. ఈ కవి రచనలు...


ఈ కవి, శ్రీనాథుఁడు ఆత్మస్తుతి చేసికొనినట్లుగా, తన రచనలనిట్లు పేర్కొన్నాడు. 'శ్రీకరంబుగఁ బది రెండవయేట’ సీసపద్యము చూడఁదగును. దీనినెల్ల సంగ్రహించి శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు ఇట్లు వ్రాసినారు. ఈ కవి గ్రామణి తన పది రెండవయేట దారావళులు, మునిముని మీసంబు మొనయునేట యమశతకము, యిరువదవయేట శృంగార రసమంజరి, యిరువది యేనవయేటఁ గృష్ణమల్లకథ, యౌవనమందు బాల రామాయణ ద్విపదము, చాటు పద్యములు, పాణిని లింగానుశాసనము, రామకవి లింగనిర్ణయము[1]ను జేర్చి యొక గ్రంథము, తెలుగు ప్రతాపరుద్రీయము , తెలుఁగు రసమంజరి, అభినవాంధ్ర నిఘంటువు,(యిదే వేంకటేశ్వర నిఘంటువు)

  1. ఇది శ్రీ పూండ్లవారి యుపోద్ఘాతము పుట 1 లో రామలింగకవి నిర్ణయము' అని పొరపాటున పడినది. గ్రంథములో సరిగానే యున్నది. వీరి తప్పొప్పుల పట్టిక సమగ్రము కాదు.