పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

53

క. ఘనుల కథలు విన నొల్లవి | జనుడు పశుప్రాయు డనఁగ సందియమేలా
   చనుఁ బశువై నను వరగా యనగీతులఁ జొక్కు సర్పమైనను ధరణిన్ 198

క. ఐదింద్రియములలోపల | నాదిమములు కనులు చెవులు నవి రెండేకా
   మోదమున రూపదర్శన | నాదశ్రవణముల నిచ్చు నానాగతులన్. 199

క. శ్రవణం బనునది త్రివిధం | బవు సత్త్వరజస్తమోగుణాయత్తంబై
   భువి దీనిఁ దెలిసి మానవుఁ | డవిరళమతి యగుచు వినఁగ నను సత్కథలన్.200

క. నిగమాగమాది సాత్విక , మగు సాహిత్యాది యెందు నగును రజోజం
   బగు నన్యుల దోషంబులు | ప్రగణించుట గలహవార్త రహఁ దామసమున్. 201
 
తే.గీ. ధరణి నుత్తమ మధ్య మాధమములగుచు, మూడు విధముల సాత్వికంబును బొసంగు
   మోక్షమును నాకమును భోగమును గ్రమంబు గా నొసంగును దీని మార్గంబు నుండు.202

క. రాజసమునుఁ ద్రివిధం బగు నోజం బూర్వోక్తవిధము లొంది తదీయా
   వ్యాజశ్రవణ మనన్ స్వీ | యాజారాన్యాప్రసంగ మందురు పెద్దల్. 203

క. తామసమును ద్రివిధంబగు | భూమిన్ బూర్వోక్తరీతిఁ బుణ్యరహితు ను
   ద్దామవధ పగతుతో సం | గ్రామంబును నిర్ణిమిత్త కలహము వరుసన్. 204
 
ఉ. కావున మౌనివర్య శుభకారణమైన పురాణసంహితా
    గ్రామము వీనులం జొనుపఁగావలెఁ బాపము నెట్టఁగావలెన్
    ధీమహిమంబు వర్ధిలఁగ దేలవలెన్ సుఖలీల మమ్ము స
    ద్భావమునన్ దలంచుచు సుధారసధారలు చిల్కఁ దెల్పవే. 205

ఉ. నాపుఁడు సూతుఁ డమ్ము నిజనంబులతో నను ధన్యు లీర లెం
    తే విన నిచ్ఛయింత్రు వచియింపఁ దలంచెద నేను ధన్యుఁడన్
    శ్రీవరుఁ డేకసాగరవిశిష్టము లోకము నొందనప్డు ని
    ద్రావశతన్ భుజంగములరాయని పై శయనించి యుండగన్.206

వ. నారాయణుని శ్రవణమలంబునుండి మధుకైటభు లుద్భవిల్లిరి. 207

ఉ. పుట్టి క్రమక్రమంబునఁ బ్రపూర్ణతఁ జెంది మహాబ్ధి లోపలన్
    దిట్ట తనంబునం బటుగతిన్ విహరించుచు నాటలాడుచున్
    కట్టిడి రక్కసు ల్వెస నొకానొకనాఁడు మనంబులందుఁ దా
    రిట్టులు చింతకుం దొడఁగి లిరిద్దఱు నొద్దిక నొక్క తావునన్. 208

క. ఆధారము లేకిల నొక | యాధేయము నిలువఁజాల దది నిక్కంబౌ
    బోధపరుల చిత్తములకు | నాధారాధేయభావ మది చూపట్టున్. 209