పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ. కోరిక లేక లోకములకుం భవకారణ మైతి వీ వహో
    చేరి భవ చ్చరిత్ర మతి చిత్రము దేవి యెఱుంగ శక్యమా
    యేరికినేని మా మనము లెంతయు నెవ్వగఁ జిక్కి పొక్కడిన్
    నేరము మేము నీ వయిన నేరపు నీ గుణము ల్గణింపఁగన్.152

చ. భగవతి నీ వెఱుంగవొ క్షపాచరవైరి శిరంబుపాటు ము
    జ్జగములఁ బ్రోచుఁ దల్లి వని సారెకు నీ పదము ల్బజించువాఁ
    డగణిత పుణ్యుఁ డప్శయనుఁ డయ్యెయొ చేసిన పాప మేమొకో
    తగునె యుపేక్ష నిర్జర వితానముపై నిటు లక్కజంబుగన్.153

చ. హరి తలఁ దూలఁ జేయుట మహత్తరమైన విషాద హేతువై
    పొరలితి మీవు నాటితివి భూజము దానిన నీకరంబులన్
    బరువడి ద్రుంప నింతవలెనా సరికాని సురాళిచేతనౌ
    దురితమువల్ల నా యతని దోర్గత గర్వమువల్లనా సతీ. 154

ఉ. దానవు లెవ్వరేని రణ దారుణ భూముల నోడి నీ పద
    ధ్యానము సేసిరో సకల ధాత్రి మురారి శిరంబుఁ దూల్చి యెం
    తేని వినోదముం గనెనొ యిందిర మీదనుఁ గోపగించితో
    మా నుడు లాలకించి యిఁక మానుమి కోపము మమ్ముఁ బ్రోవుమీ. 155

ఉ. ఓ పరమేశ్వరీ మము నయో బహులార్తి సముద్రమగ్నులన్
    బాపుల నీచులం పావని ప్రోవవె మా జనార్దనున్
    లేపవె యేడ నేఁ గలదొ లేదో యెఱుంగము త చ్ఛిరంబు వి
    ద్యాపర యీవ త క్కొక యుపాయము మాకిక వేఱ యున్నదే. 156

క. అమృతము జీవనమునకున్ | విమలోపాయ మయినట్లు విశ్వజనని లో
   కము బ్రదుకఁజేయఁగ నుపాయము వీవకదా నిరంతరానందమయీ. 157

వ. అని బహువిధంబులగు దీనాలాపంబులతోఁ బరమేష్టి మున్నగు బృందారక బృందంబుల
   యనుమతి నిగమంబు లత్యంత భక్తిం గొనియాడె నని చెప్పి సూతుడు మఱియు. 158

క. అని యిట్టులు గొనియాడిన విని దేవి ప్రసన్న యగుచు విబుధులతోడన్
   మినుద్రోవనుండి ముద్దగు, మినుకులతో నిట్టు లనియె మేలగు ననుచున్. 159

తే.గీ. వెరవు దెల్పేద సురలార వెరవకుండు | వేదములు నన్ను మిక్కిలి వేడి వేడి
   యలసి సొలసె మదీయాత్మ కలఘుతృష్టి | గలిఁగె సందియ మేమి మీ కాంక్షదీర్తున్.160