పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

47

ఉ. అంతట నంధకార విలయం బగుడున్ సుర లెల్ల విస్మిత
    స్వాంతత నుత్తమాంగరహితాచ్యుతుఁ జూచి విషాద మెచ్చఁగా
    నెంతయు బాష్పము ల్దొఱఁగ నేడ్చిరి బావని హా రమేశ హా
    కాంత యనంతసంతతసుఖప్రద కేశవ యంచు నొక్కటన్. 132

క. ఏ దేవు మాయయో యిది | యీ దివ్యశరీరమునకు నిది యొప్పిదమే
   యో దేవదేవ నీకునుఁ బై | దైవము కలదె యిట్టి పాట్లకుఁ దగుదే. 133

తే.గీ. ఇది తలంపఁగ రాక్షస కృతము గాదు యక్ష కృతమును గాదు దైత్యవర కృతము
   గాదు దేవతలము మేమె కారణంబు ! కాన నెవ్వరి దూషింపఁగలము మేము.134

తే.గీ. ఏము పరతంత్రులము మాకు నెవ్వ డింక | శరణ మయ్యెడు నయ్యయో శిరము లేని
   కమలదళ నేత్రుఁ జూడంగఁ గలమె యిపుడు | కలఁగి వలవల వలపోయఁగలము గాక. 135

తే.గీ. మాయ కీశ్వరుఁడైన యీ మాధవునిఁ గబంధమాత్రునిఁ జేసిన మాయ యెదియొ
   కాదు సాత్త్విక రాజసి కాదు కాదు ! తామసి యిదేమి చిత్రమో తలఁపరాదు.136

క. అని విలపించెడి దేవతలనుఁ గని పరమేష్టి యూరడం బలుకుచు శాం
   తిలఁ జేసి మహామహులై యలరెడు మీ రిట్లు శోక మందఁగ నేలా. 137

క. శోకించుటచే ఫల మే లా కలుఁగు నిరర్థక ప్రలాపము వంకన్
   బోక గతమునకు నేడ్వక | పై కార్యము సూచువాఁ డుపాయజ్ఞుఁ డిలన్. 138
 
క. దైవమును బురుషకారము , నే వెరవున రెండె కావె యిందును బురుష
   వ్యావృత్తి మానకుండిన నా వెనుకం దైవమే ఫలావాప్తి యిడున్. 139

వ. అనిన నింద్రుండు. 140

తే.గీ. దైవమే యెక్కుఁడగు నెందుఁ దలఁచి చూడఁ | బురుషకారంబునకు ఫలస్ఫూర్తి లేదు
    నిర్జరులు సూచుచుండంగ నిఖిలలోక | పాలకుండగు హరికె యిప్పాటువచ్చె.141

వ. అనినం బితామహుండు.142

క. కాలప్రాప్తం బగు నది , వాలాయం భనుభవింప వలసినదేకా
    మేలైనను గీడైనను, వీలౌనే యతిక్రమింప వెస దైవికమున్.143

క. సందియము లేదు దేహికి | నెందు సుఖము దుఃఖము భుజియింపక పోవన్
    సందు గలదె నాకును మునుఁ | గందర్పహరుండు శరము ఖండించె జుఁడీ.144

ఉ. శాపవశంబునన్ ద్రిపురశాసను లింగము డుల్లె నట్టులే
    శ్రీపతి మూర్థముం దెగె శచీపతి కయ్యె సహస్రయోని తా
    ప్రాపణదుఃఖముం దిగువుబాటును స్వర్గము నుండి మానస
    వ్యాపిసరోజవాసమును హా యిక నేరికి లేవు దుఃఖముల్. 145