పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

శ్రీ దేవీ భాగవతము


ఆ.వె. యోగనిద్ర నున్న భోగిశాయిని జూచి, విష్ణు నిదుర కడలి వింతనొంది
     యచట నిలచి విధియు హరుఁడును మున్ను గా నమరులకును శక్రుఁ డనియె నిట్లు. 121

ఉ. ఏమి యొనర్చువార మిపు డీ హరి నిద్దుర సూడ నద్భుతం
     బౌ మన మిప్డు దానికిని భంగము సేయు విధంబు సెప్పుడీ
     నా మదనారి యిట్లను మనంబునఁ దాఁ బరికించి యో సుర
     గ్రామపతీ హఠాత్తుగ సుఖంబగు నిద్ర నడంచు టొప్పునే. 122

వ. అనిన నంత.123

ఉ. జన్నము తప్ప దిప్డు సురసత్తములార వినుం డనింద్యమౌ
    పన్నుఁగడన్ వచింతు నని పద్మజుఁడే నిపు డొక్క వమ్రి ను
    త్పన్నము చేసి పంపినఁ బదంపడి యుద్ధి శరాసనాగ్రమున్
    దిన్న నడంగు నప్డు హరి నిద్రఁ దొలుగు సవంబు సేకుఱున్. 124

తే.గీ. అనుచు వైళంబ పరికించి యజుడు వమ్రి | నొక్క దానిని సృజియించి యోసి వమ్రి
    హరి శరాసాగ్రమును దిని యతని నిదుర | నడవు మని యానతిచ్చిన నాలకించి. 125

తే.గీ. నిద్దురకు భంగ మే నెట్లు నేర్తుఁ జేయ | నాదినారాయణుఁడు సూడ నఖిల గురుపు
    కార్యమూ చూడఁ బాతిత్య కారణంబు | నన్నుఁ బంపుట కూడునా నలినగర్బ. 126

తే.గీ. నిద్రకును భంగ మొనరించు నీతి రహితు నకుఁ గథాచ్చేద పాతకం బొకటి దంప
    తీప్రణయభేదనం బొండు దివిర్ మాతృ , శిశు విభేదన మొక్కండు చెందకున్నె. 127

తే.గీ. ఒక్కనాటి తిండి యొక తిండిగాదుసుం డెల్లకాలమునకు నెద్ధియేని
    దిండి దొరికెనేనిఁ దెగబారి చేసెద, ననిన వమ్రి గాంచి యజుఁడు పలికె. 128

తే.గీ. హోమకర్మలందు నొనరంగఁ బ్రక్కల | బడిన హవిసు నీకు భాగ మిత్తు
    వేగ నేగి నీవు వింటికొప్పునుఁ దిని | హరిని మేలుకొల్పు మనిన వమ్రి. 129

క. వనజభవు నానతిం గొని | చని యంత శరాసకోటిఁ జప్పగ భక్షిం
    చినఁ దెగియె నారి పశ్చిమ మున నుత్తరకోటి యపుడు భోరన నూడెన్. 130

సీ. పటపట బ్రహ్మాండ భాండంబు క్షోభిల్లె గడగడ సాచల క్షమ వడంకె
    గళగళ నంభోధి జలము లెల్లఁ గలంగె ఱివ్వుఱివ్వున గాలి ఱేఁగి వీఁచె
    తటతటఁ బర్వతస్థల సానువులు రాలె జలజలని మహోల్క లిలఁ దొరంగె
    మలమల దెస లెల్ల మాడి ఘోరము లయ్యె మకమక సూర్యుండు మాసి క్రుంకె

తే.గీ.ఢమ్ము ఢమ్మను భయద శబ్దమ్ము పుట్టి | కుండలంబులతోడ వైకుంఠు శిరము
     హేల నుప్పరమునకుఁ బెల్లెగసి యెందె | వడియె వడిసెలలో ఱాయి పగిది నపుడు. 131