పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

శ్రీ దేవీ భాగవతము


ఉ. నీవ సమస్త లోకముల నేతపు కర్తవు హర్త వౌదు నీ
    సేవ యొనర్చి నే జగము సృష్టి యొనర్తు హరుండు ద్రుంచు నా
    జ్ఞావిధి సూర్యుఁడుం దిరుఁగు గాడుపు వీచును వహ్ని మండు నం
    భోవహపఙ్త్కియు గురియు భూరి గుణోదయ సాధుసంశ్రయా. 97

క. నీకుసు ధ్యేయము కలదా | కాకున్నఁ దపంబు సేయఁ గారణ మేమీ
   యో కరుణామయ తెలుపవె యేకడఁ బెద్దలకుఁ గలవె యిల గోప్యంబుల్. 98

క. అనిన విని విష్ణుఁ డజునకు • ననియె న్వినుమంచు నోయి యమరజ్యేష్ఠా
   నను నీ వడిగిన యర్థము : వినఁ దగినద కాదె సర్వ విధముల నెన్నన్. 99

తే.గీ. ఈవు సృజియింతు రక్షింతు నేను హరుఁడు | సంహరించును జగమెల్ల శక్తి యొకటి
   గల్గి యున్నందుననె సుమ్ము కాకయున్న | నలతుల మశక్తులము దీనిఁ దెలిసికొమ్ము.100

తే.గీ. సర్గ మీవు రజోగుణశక్తివలన | యుక్తి నేఁ బ్రోచు టది సత్త్వశక్తివలన
   సంహరణ మీశ్వరుఁడు దమ శ్శక్తి వలన | సలుపుదుము మన యేలిక శక్తి గాదె. 101

తే.గీ. శేషుఁ డాధారమై యుండఁ జెలఁగి యేను నస్వతంత్రుండనై నిద్ర నంది యుండ
   గాలవశమున మేల్కాంచి కడఁగి తపము | సలుపుచును విహరింతు శ్రీలలనఁగూడి. 102

గీ. కొన్ని యెడలను దానవకోటితోడ | సమర మొనరింతు దేహంబుఁ గుములఁజేసి
   సకలలోక భయంకర ప్రకటలీల | నిల పయోమయమై నప్పుడెల్ల రెరుఁగ || 103

తే.గీ. కర్ణ మలజులయిన మధు కైటకులను | నసురవర్యుల నెదిరించి యైదువేల
   హాయనమ్ములు బాహుజన్యమ్ముఁ జేసి , దేవికృప వారిఁ ద్రుంచుట యీవెఱుఁగవె. 104

తే.గీ. కాన నద్దేవియే సర్వ కారణ మని | శక్తిరూపిణి యని సుఖశాలిని యని
   యీవు నెఱుఁగుదు వట్లయ్యు నింక నింక | నడుఁగ నేటికి సుధ్యేయ మదియ నాకు.105

క. ఇచ్ఛాయోగంబుననే నచ్చజలధి మీనరూప మందితి మఱియున్
   గచ్ఛపమ నైతిని వరాహచ్ఛాయుఁడ నృహరి వడుగ నైతిం గంటే. 106

ఉ. ఇంపులు సొంపులుం గులుకు నిందిర పొం దెడఁబాసి యెంతయున్
    దెంపున నీచ జంతువుల దేహఘులం ధరియించి శయ్యయున్
    గొంపయుఁ గాన కెవ్వఁ డరుగున్ సమరంబులకున్ స్వతంత్రతన్
    బెంపు వహించు నేనియును వే యిక నేటికి నీ వెరుంగవే. 107

చ. నలినజ! పూర్వకాలమున నా తల కార్ముక విస్ఫురద్గుణ
    స్ఖలనముచేత వీఁడి చనగా హయశీర్షము నీవ తెచ్చి నే
    ర్పలరఁగ శిల్పివర్యు పని నచ్చుగఁ గూర్చిన నే హయాననో
    జ్జ్వలతఁ బ్రకీర్తితుండనయి పాటిలు టీవ యెఱుంగుదే కదా. 108