పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రొన్నుడి

ముక్కోటి యాంధ్రుల మన్ననల నంది నేడు ముచ్చటగా మూడవ ముద్రణ మంది పాఠకమహాశయుల హస్తముల సలకరించుచున్న దీ "శ్రీమదాంధ్ర దేవీభాగవతము".

గ్రంథకర్త శ్రీ దాసు శ్రీరాములుగారు. క్రీ. శ. 18 వ శతాబ్ద్యుత్తరభాగమందును 23 వ శతాబ్ద్యారంభమునను మహాకవిగా ఖ్యాతిగన్న మహామనీషి. వారనేక శాస్త్రములందు సిద్ధహస్తులు. ఏకసంథాగ్రాహులు. బహుముఖ ప్రజ్ఞావంతులు, లఘుకృతులలో వేరేన్నిక గన్న "తెలుఁగునాఁడు" నందలివియు, బృహద్గ్రంథమయిన శ్రీదేవీభాగవతములోనివియు నగు పద్యము లిప్పటి కపులకుగూడ కంఠస్తములే.

శ్రీ దాసు శ్రీరాములు గారు రచించిన పొతములలో కొన్ని ముద్రితములయ్యు లభ్యమగుట కడు దుస్తరముగా నున్నది. కొన్ని శిథిలము లయినవి. మఱియు కొన్ని వ్రాతప్రతులుగానే నిలిచిపోయినవి. వీరి రచనలను జిజ్ఞాసువులకు లభ్యములు కావించుటద్వారా వీరి ఖ్యాతిని పునరుద్ధరణ మొనర్చుట ముఖ్యవిధిగా నెంచి మేము 1978 వ సంవత్సరము డిసెంబరు మాసములో “మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి" ని హైదరాబాదులో స్థాపించతిమి. వారి గ్రంథములు సేకరించుట, వాని ముద్రణ యనున వీ సమితి ముఖ్యాశయములు.

వీనిని దృష్టియందుంచుకొని ముద్రితములై యున్న గ్రంధములను కొన్నిటిని, ఆముదిత్రములైన 1. కురంగగౌరీశంకర నాటికను, 2. లక్షణావిలాస మను యక్షగానమును ఇప్పటికి సేకరింపగల్గితిమి. శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రుల వారిచే "రెండవ శ్రీనాథుడు"గా నేగ్రంథము వలన శ్రీరామకవిగారు భావింపబడిరో యా "తెలుఁగునాడు" 6వ కూర్పు ప్రప్రథమముగా మాచే ముద్రితమైనది. ప్రబంధలక్షణములన్నియు గలిగి, వచనములో నపూర్వకథతో నొప్పు "అభినవగద్యప్రబంధము" అటుపిమ్మట ముద్రణ నొందినది. ఆ తదుపరి వీరి జయంతి సంచిక. గ్రంథకర్తగారికి 'మహాకవి'యను బిరుదమును సమకూర్చిన ఈ దేవీభాగవతము నాల్గవది. ఆ ముద్రణమునందు వెనుకటి కూర్పులలోని దోషములు సవరింపబడినవి.

శ్రీ దాసు శ్రీరామామాత్యులవారు రచించిన యేగ్రంథమైన మా కందజేసియైనను, లేక యది లభించుతావు నెఱుకపరచియైనను మా యత్నము సఫల మొనరింప పాఠకమహాశయులను ప్రార్థించుచున్నాము.

మాకీ గ్రంథముద్రణమున సహాయ మొనర్చిన యెల్లరకు కృతజ్ఞతలు.

మాకు చేదోడు వాదోడుగా నుండియు, నిర్మాణమునకు పెక్కువిధముల దోడ్పడియు, మాకు సమధికోత్సాహము గల్పించిన “ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి" వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

హైదరాబాదు
20-7-1978
దాసు పద్మనాభరావు,
అధ్యక్షుడు
మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.