పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శారదాంబాయై నమ:

శ్రీ దేవీ భాగవతము

కృత్యాది దేవతా స్మరణాదికము

-: కృతిపతి దేవతా స్మరణము :-

శా. శ్రీ గౌరీనయనాబ్జ కజ్జలమునన్ జిల్మారు నోష్ఠంబు గం
    గాగోత్రస్తనిమోవిపానకమునన్ క్షాలించి తద్దత్తరే
    ఖాగోపార్థము భూతిలిప్తతనుఁడై కన్పట్టుదాక్షిణ్యవి
    ద్యాగంభీరు మదిం దలంచెద సదా, యల్లూరి సోమేశ్వరున్.


——♦♦ గౌరీ ప్రార్థనము ♦♦——


సీ. నల్లమబ్బులచాయ • లల్లారు తలకట్టు | సన్నజాబిలి రేఖ • సరస కొరియ
    లలిత నితంబలీ లాకలాపంబుల | పై పయిం గురువింద పఙ్క్తి మెఱయ
    పాదాగ్రములజొత్తు పట్టెల నందంద | నఖరకాంతులు తందనాలు సలుప
    చందనాగరు సువాసన లీను తరులలోఁ | జిలుగారు పొగసోగ చెలువు గులుక

తే. భూరిమహిమ మహాదేవ భోగ్యమగుచు | దనరు కూటమ్ములు కృతార్థతను వహింప
    దండ్రిపోలిక నౌన్నత్య దశను బూను | కలికి గౌరమ్మ మాపాలఁ • గలుగు మమ్మ ||


——♦♦ శ్రీకృష్ణ ప్రార్థనము ♦♦——


చ. పొలుపగు నల్లకానుగుల • పుంతను యామునభూమి రాత్రులన్
    జెలువములీను గొండెసిగ • జెర్వినబర్హము గుల్కఁ గస్తురిన్
    జిలికిన గీరునామ మిడి • చీకటితప్పుల కొప్పురీతితో,
    జెలగి ప్రజాంగనాసుఖము • చెందిన కృష్ణుడు మమ్ము నేలుతన్ ||


——♦♦ మహా లక్ష్మీ ప్రార్ధనము ♦♦——


సీ. ఏమానినీరత్న • మెడవాయ దీనుని | ఱొమ్మునందును వీక్షణమ్మునంచు
   ఏసతీతిలకంబు • భాసిల్లె సహజయై | నాగంబునకు నిర్జరాగమునకు
   ఏవధూమణి జగద్దితయయ్యె దేవమ | తల్లియైయును గన్న తల్లియయ్యు
   ఏస్త్రీలలామం బ మృతవార్థి కుదయించె | శ్రీలతో శృంగార లీలతోడ