పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

శ్రీ దేవీ భాగవతము


తే.గీ. భూమినాయక వినుము దేవీమఖంబు నీవొనర్పుము నిఖిలంబు నీదసుమ్ము
    పరమపావనమైనట్టి భాగవతము | వినుము విన్పించు నేను సవిస్తరముగ. 389 389

తే.గీ. పరమపావనమైనది భాగవతము | రాగలోభాదుల నడంచు భాగవతము
    భవభయంబులఁ దొలగించు భాగవతము | భగవతీభక్తి పలదంబు భాగపతము.390 390

క. దేవీపాదాబ్జంబులు | సేవించినవారు సుఖముఁ జెందుదురు ధరం
    దేవీపాదాబ్జంబులు। సేవింపనివార లఘుముఁ జెందుదురు నృపా!391 391

చ. భగవతి విష్ణుదేవునకు భాగవతంబునుఁ జెప్పెఁ గావునన్
    దగ నిదతక్క నన్యమగు దారిని బోయిన మోక్షమబ్బునేఁ
    జగతి నరాధముల్ తెలియఁజాలరుగాక నరేంద్ర నీకు నే
    భగవతిఁ గొల్చి చెప్పెదను భాగవతం బిది చిత్తశాంతికిన్.392 392

స్కంధాంత కృతిపతి సంబోధనము


శా. తాలక్ష్మాశతార్బుదోపమకరోద్ధండోగ్ర వేదండర
   క్షోలక్ష్యాక్షిమహాశుశుక్షణిసుతేజోమాలికాపాలికా
   లీలాశాలిశిలీముఖప్రకరకేలీలోలజేగీయమా
   నాలీఢాజగవప్రచారసమరా యల్లూరి సోమేశ్వరా.393 393

స్రగ్విణి. సోమలేఖాజటాజూటసంభారశో
        భామహోదారతా పాలితద్యోపురా
        రామవిస్ఫారకల్ప ప్రసూనోత్కరా
        వ్యోమగంగాధ రాల్లూరి సోమేశ్వరా!394 394

గద్య. ఇది శ్రీమదిష్టకామేశ్వరీపాదారవిందమకరందతుందిలమానసేందిందిర, దానువంశ
       పయఃపారావారరాకాసుధాకర, కామాంబాకన్నయమంత్రీంద్ర కుమార, పవిత్ర హరిత
       గోత్రాలంకార కృష్ణామండల మండనాయమానాల్లూరగ్రహార పూర్వార్జితధరావిరాజ
       మాన, శ్రీవీరప్రతాప కోర్కొండహంవీర రామచంద్ర భూమీశ్వరదత్త గోదావరీ
       మండలస్థిత సీతారామపురార్ధభాగ పరిపాలనాధీన, పూర్వోక్తోభయమండల న్యాయ
       సభావాదక నియోగభారవ్యవహార, శ్రీ వేంకటేశ్వరవరప్రసాదసంభూత కవిత్వ విద్యా
       విశేషబాల్యాదిరచిత త్రింశత్ప్రత్యేక గ్రంథ మతిసార, విబుధజనకరుణాసంపాదితో
       భయభాషాపరిచిత ప్రచారనిత్య, శ్రీరామామాత్య ప్రణీతంబగు శ్రీ దేవీభాగవతంబను
       మహాపురాణంబునం ద్వితీయస్కంధము.

ద్వితీయస్కంధము సమాప్తము.