పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

శ్రీ దేవీ భాగవతము


సీ. ఆదటఁ గద్రువ యాత్మజులనుగొంచి తారుసూచిన హరిదశ్వునశ్వ
    మును నల్లనిదిసేయుఁ డనిన వారలఁ గొంద ఱొల్లమి శపియించె నుక్కుదరిగి
    యీరలు జనమేజయేలావిభునియోగమున నగ్నిలోఁ బడుడనుచుఁ గొంద
    ఱంబపంపునుఁజేసి రంత గద్రువమును వినతయుఁ జని యశ్వమును గనంగ

తే.గీ. నల్లనిదియైన వినత డా డిల్లపోయి | తనకుమారుని గరుడుని గనిన నాత
    డేకతంబునఁ తల్లి నీ కిట్టి దీన | భావమొదవె ననంగ నా భామ పలికె.372

క. గరుడా నేఁ గద్రువకుం బరిచర్యలు సేయవలసె బహునీచగతుల్
    పరమేష్ఠి గలుగఁజేసెన్ గొఱమాలినదాన నైతిఁ గొడుకా యనుచున్. 373
      
వి. విలపించి సవతికిం దనకును జరిగిన పంతంబుల యువంతంబంతయుం దెలిపి పంతం
    బీడేరక తాఁదాసిగావలసివచ్చిన విధంబుఁ దెలిపి రా తక్షణంబ తనుఁ జంక నెక్కించు
    కొని మ్రోయమనుచుఁ గద్రువ బాధించుచున్నయది నే నేమిసేయుదుఁ దండ్రీ యని
    విలపించు తల్లిం గాంచి మంచివచనంబుల నామె ననునయించి నీ వేలచింతిల్లెదవు
    కద్రువ కోరినయట్ల నేన చేసెద నని యేగి కద్రువం గాంచి సమస్కరించి యమ్మా
    నిన్ను మ్రోయవచ్చితి నని పల్కి యక్కుటిల జేతులపై నెత్తుకొని సముద్రతీరంబుచేరి
    యచ్చట డించి తల్లీ నాయమ్మ దాసీభావంబునుడుపం గోరెద ననిని నాకద్రువ దేవ
    లోకంబునుండి యమృతభాండంబు గొనివచ్చి నా కిచ్చిననాడు నీతల్లి దాసీభావంబు
    విడుచు ననిన నామె పలుకులు విని తార్క్ష్యుడు తన మనంబున సంతసిల్లి 374

మ. బలవంతుండు వైనతేయుఁడు మరుత్వన్ముఖ్యదేవప్రజం
    బుల నోడించి వడిన్ సుధాకలశమున్ బొల్పారఁ దాఁ దెచ్చి ని
    శ్చలతం గద్రువ కిచ్చినం గని మహాశ్చర్యంబుతోఁ దల్లికిం
    గల దాస్యంబును బోయే బొమ్మన విహంగస్వామి సంతుష్టుడై 375

క. చనినవెనుక నమృతంబును గొను తలఁపున భుజగవరులు గొబ్బున నీటన్
   మునుగంబోయిన సమయం | బున నింద్రుఁడు దాని గొనుచుఁ బోయెం దివికిన్. 376

క. తరువాత నాగవరులం దరు నమృతముగాన కార్తిఁ దడబడి దర్భా
   స్తరణము నాకిన నాలుక లిరియంగ ద్విజిహ్వలై రిలేశ్వర వారల్.377

ఆ.వె. తల్లిచేత శాప తప్తులై వాసుకి ప్రముఖు లేడ్చికొనుచు బ్రహ్మకడకు
   బోయి మొరలిడంగ నాయజుం డతిదయా పరత నిట్టులనుచుఁ బలికె నపుడు.378

క. కలడు జరత్కారుండన నలరెడు ముని వానికి న్నయం బెనగఁగ బెం
   డిలిసేయుఁడు వాసుకి చెలియలిని సనామకను; బుట్టుఁ నాస్తీకుఁ డనన్.379