పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

శ్రీ దేవీ భాగవతము


-: ధృతరాష్ట్రాది మరణవృత్తాంతము :-


క. తరువాత మూడునాళ్లకు | సరిగిరి సురపురికి దపహుతాశనకీలా
   పరివృతులయి ధృతరాష్ట్రుఁడు | మఱి గాంధారియును గుంతి మ్రగ్గుచు నొకటన్.248
 
ఉ. అంతకు మున్న సంజయుడు యాత్రకుదోయినవాడు గాన దా
   నింతయు బ్రహ్మసూతి వచియింప నెరింగి, యుధిష్ఠిరుండు బల్
   చింతవహించె నప్పటికి జేరెను ముప్పుదియారు వర్షముల్
   వింతల గౌరవుల్ యముని వాసముచేరిన దాటి సేయగన్.249

వ. అది యట్లుండ ప్రభాసతీర్థంబున విప్రశాపంబునం జేసి యాదవులు క్షయించిరి. బల
   భద్రుండును నిర్యాణంబు నొందె వ్యాధబాణహతుండై కృష్ణుండు దేహంబు
   విడిచె. నరణ్యంబున వసుదేవుండు గాయత్యాగంబుచేసె. నంతట బార్థుండు ప్రభాస
   తీర్థంబునకుంబోయి శోకాకులుండగుచు యథావిధి నెల్లరకు సంస్కారంబులు చేసి కృష్ణుని
   దేహంబుతోడ రుక్మిణి మున్నగు నెనమండ్రు భార్యలం జేర్చి దాహకృత్యంబు నెరపి రేవతితో
   బలభద్ర దేహసంస్కారంబుఁ గావించి ద్వారక కరుదెంచి యందున్న జనుల బహిర్నిష్క్రమణంబు
   చేయించె. నంత ద్వారక సముద్రంబున మునింగెఁ తదనంతరం బర్జునుం డింద్రప్రస్థపురంబు
   బ్రవేశించి యదురాజ్యంబునకు ననిరుద్ధకుమారు వజ్రు నధిపతింజేసి యది వ్యాసునకెఱింగించిన
   నతండు వజ్రుంగాంచి తొల్లి శ్రీకృష్ణుండెట్టుల నట్టుల నీవుగ్రతేజుండవు కాగలవని చెప్పి చనియె.
   బిమ్మట సుభద్రాప్రియుండు హస్తిపురంబు ప్రవేశించి ధర్మరాజునకు యాదవకులక్షయంబు
   క్రమంబుగాఁ జెప్పి శ్రీకృష్ణుండు దేహంబు చాలించెనని చెప్పి నతం డతిదుఃఖితుండై
   నిజరాజ్యంబుసకు నుత్తరాకుమారుం బ్రభువుంజేసి తాను రాజ్యంబు సేయనారంభించె నది
   మొదలు ముప్పదియారవవత్సరంబుతుద హిమాచల సమీపారణ్యభూములకు ద్రౌవదియుం
   దమ్ములుందోడరాఁ బయనంబుచేసి చని వనంబులం బ్రవేశించి యచట నందఱు ప్రాణం
   ద్యజించిరి. ఇచట ధార్మికుండైన పరీక్షిన్నరేంద్రుం డతంద్రితుండై
   యఱువదియేండ్లు ప్రజాపాలనంబుఁ జేసె నంత.250

తే.గీ. వేటవేడుక నుత్తరబిడ్డ విపిన భూములకు విల్లునమ్ములు పూనియేగి
   మృగములవధించి యెండలో మిగులడస్సి , గొని యొకమునీంద్రు నాశ్రమంబునకుబోయి.251

తే.గీ. చని యచట ధ్యానమందున్న మునిని జూచి , జలము నడిగిన ముని మాఱుపలుకకున్న
   గనలి మృతసర్పమును వింటికొననుఁ బట్టి | యతని మెడ నిడెఁ గలిజితప్రతిభుఁడగుచు.252