పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

శ్రీ దేవీ భాగవతము


శా. ఏకాంతంబున నిస్పృహుండగుచు నెందేపోయి బ్రహ్మాహమం
    చేకోహమ్మనుచున్నవాడనిన భూమీశుండు దా నంత నా
    కౌకోవాహినిచెంతఁ బోవునెడ నొయ్యంజూచె క్షామాంగు న
    స్తోకానందమయాత్మునిన్ విదురునిన్ శుద్ధాద్వితీయుస్థితున్.226

మ. ఆనఘాయాద్వయరూపిణే విదురనామ్నేపాయజేత్రే నమో
    స్తనుచు న్మ్రొక్కిన వీనులం బడియు వి న్నట్లింతయుం గానరా
    కనివార్యస్థితి సూరకుండఁగఁ దదీయాస్యంబునందుండి గొ
    బ్బునఁ దేజం బొక టుద్భవిల్లి కలసెన్ భూనాధు నాస్యంబునన్.227

ఆ.వె. ధర్మతేజమపుడు ధర్మాంశజునియందు బడినయపుడ విదురు పాటు సూచి
    శుద్ధమూర్తి ధర్మజుండు శోకాకుల | చిత్తుఁడగుచుఁ గొంత సేపు చూచి.228

ఆ.వె. విదురదేహదాహ విధికినై తలపోయు ! చుండ నాకసమున నొక్కపలుకు
    వీనులంటె నితఁడు వినుము విరక్తుండు  ! దాహవిధులు సేయఁదగ డటంచు.229

క. విని గంగాజలమున నా | తని దేహమువైచి పెద్దతండ్రికి విఙ్ఞా
   పన చేసి వారలందరు | వనముననే యుండఁ గొన్న వాసరములకన్.230

వ. బ్రహ్మపుత్త్రుండును దపోనిధియు నగు నారదుండును. ధర్మకోవిదుండును, నిఖిల
   తత్త్వైకవేత్తయు నగు వ్యాసుండును, మరికొందఱు తాపసులను గూడి యవ్వనంబున
   వాసంబు సేయు యుధిష్ఠిరాదులం జూడ విచ్చేసినం గాంచి ధర్మజుండు వారల
   యథోచితంబుగా బూజించి కూర్చుండ నియోగించియున్న సమయంబున వ్యాసుం
   గాంచి కుంతి యిట్లనియె.231
 
ఆ. కన్ననాడు నేను కర్ణునిఁ జూచితి ! దాని మొగము చూడవలయునంచు
    మసము మిగులఁ దప్యమానమౌచున్నది చూపుమయ్య, నాకు శుభచరిత్ర.232

ప. అంతట గాంధారియు నిట్లనియె.233

ఆ.వె. సమరమునకుం బోవు సమయంబునందు నా | సుతు సుయోధనాఖ్యుఁ జూడనైతిఁ
    జూపుమయ్య వారి సొరిదిఁ దమ్ములతోడ | మునివరేణ్యగణ్య భూరిపుణ్య.234

వ. సుభద్రయు నిట్లనియె.235
 
తే.గీ. ప్రాణములకంటెఁ బ్రియుఁడయి పరగినాడు | వీరులందెల్ల గణ్యుఁడై వెలసినాడు
   సూను నభిమన్యు నొక్కింత చూపుమయ్య | దివ్యగుణగేయ సాత్యవతేయ నీవు.236

క. అనిన విని వ్యాసముని దా | మనమున దేవిం దలంచి ప్రాణాయామం
   బును పట్టి యుధిష్ఠిరుఁడున్ మునుగాఁగల వారినెల్ల ముదమొందింపన్. 237