పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయ స్కం ధ ము.

107

వ. అని సూతుండు చెప్పిన విని యాశ్చర్యమగ్నులై శౌనకాదు లిట్లనిరి.18

తే.గీ. అచ్చర వెలంది ముని శాపమంది యాఁడు | చేపయై మత్స్యజీవను చేతఁ జచ్చె
   ననుచు జెప్పితి వద్ది యేమాయె బిదప | స్వర్గమున కేగెనో? శాపశాంతి గలిగి.19

వ. అని యడిగిన విని సూతుం డిట్లనియె 20

క. శాపానంతరమున న | చ్చేపపడతి మునిని వేఁడ శీతలుఁడై యో
   చేపా! మానపు లిరువురు | నీపొట్టం బుట్టఁ గలుగు నిజరూపమొగిన్.21

వ. అని యానతిచ్చిన మునివాక్యంబు క్రమంబున పుత్త్రీపుత్త్ర జననానంతరం బది మరల
    నచ్చరయై స్వర్గంబునం బ్రవేశించెనని చెప్పి మఱియు.22

ఆ.వె. మత్స్యగంధి పాల్యమానమై యా దాశ | రాజుగేహమందు రమ్యరూప
    గుణగణాఢ్యయగుచు మణిబోలె నాదర | ణీయయయ్యె నెల్ల నియతులందు.23

సుగంధి. ధీరుఁడై పరాశరుండు తీర్థయాత్రఁ బోవుచో
     సూరజానదీతటంబు జూచి యందునిల్చి తాఁ
     జేరియప్డు భోజనంబు సేయు దాశభూపతిన్
     గోరెఁ దన్ను నన్యపారగు న్బొనర్పుమం చొగిన్.24

వ. అనిన విని తాను భోజనంబు సేయు కతంబున.25

క. దాశపతి హర్షమొనయ బ | రాశరమునిఁ దెప్పనిడి కరము వేడుక ఛా
    యేశ సుతం దాటింపు ని | శేశానన యంచు నానతిచ్చెను సుతకున్.26

తే.గీ. తండ్రిమాటనుఁ దలమ్రోచి దాశకన్య | యమికులోడుపు నుడుపంబునందు నిడుక
    యమున దాటించుచుండంగ నతివయొడలి | కాంతిఁ గనుగొని దైవయోగమున నతడు.27

సీ. పూతమంకెన మొగ్గ పోలిక నున్నదీ మోవి నే కలువాయి ముద్దులిడునొ
    తెల్లదామరతూండ్ల తీరుననున్న యీ చేతు లేమలినాంగు చెట్టబడునొ
    పలుచని యపరంజి పసిడిరేకులవంటి చెక్కు లేపలుగాకి నొక్కగలఁడొ
    చిన్నారి యెలమావి చిగురాకువంటి యీ యడుగు లేమ్రుక్కడి యంటగలడొ

తే.గీ. చక్కదనమెంత హొయ లెంత జగ్గులెంత | జాణతనమెంత యీ కన్నెసాటి యున్నె
    యేజగానను గాన నీయోజ గాన | దీని నంటెద ననుచు నుద్రేకి యగుచు.28

క. వలవులఱేఁడు పరాశరు | తలపు తలుపుఁ బగులనేయఁ దనువునఁ బులకల్
    మొలవఁగఁ దన వలచేతన్ | వెలఁదుక వలపలికరంబు విడువక పట్టెన్.29

వ. అంత. 30