పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

శ్రీ దేవీ భాగవతము


గర్భవతియై జాత్యంధుండగు నొక్కసుతుం గాంచె నందునకుఁ జింతిల్లి సత్యవతి వ్యాసుంగాంచి యంబికం గలయం గోరిన నతండట్లు సేయఁ బాండురోగపీడితుండగు నొక పుత్త్రుండు వుట్టె నది సూచి మిక్కుటంబగు వనటం గుంది సత్యవతి మరల నంబికం గూడుమని వ్యాసుతోఁ జెప్పిన నతం డొడంబడి శయనాగారంబున నెంత నిరీక్షించినఁ దా రాక ప్రేష్యం బంపిన దానితో వ్యాసుండు సంగమింప నది గర్భవతియై సుపుత్రుం గాంచె.769

క. అంబిక కొమరుఁడు దాఁ బిలు | వంబడె ధృతరాష్ట్రుఁడనుచు నంబాలిక పా
   లంబడినవాఁడు పాండుఁ డ |నంబడె నితరుండు విదురనామము గాంచెన్.770

వ. ఇది ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జన్మక్రమంబని చెప్పిన విని శౌనకాది మహామునులు సంతసించి.771

-: స్కం ధాం త కృ తి ప తి సం బో ధ న ము :-

శా . దీర్ఘగ్రంథకృదుత్తమోత్తమకథా దివ్యాంశసారత్రయా
     నిర్ఘోషాంచితభూమిదేవ పరిష న్నిత్యాభిషేకోత్సవాం
     తర్ఘర్మేతర వారిపూర పరిపూర్ణప్రాంత పద్మాకరా
     నర్ఘార్చావిధపూతభక్తి వినరా, యల్లూరి సోమేశ్వరా.772

స్రగ్విణీవృత్తము. శ్రీకరా, భీకరారిప్రణాశంకరా | స్తోకరాజన్మహాతోక, రాధావరానేక
      రాజీవపూజైకవిస్తార, స | ల్లోకమందార, యల్లూరిసోమేశ్వరా.

గద్య. ఇది శ్రీమదిష్ట కామేశ్వరీపాదారవింద మకరందతుందిలమానసేందిందిర, దాసు వంశ పయఃపారావారరాకాసుధాకర, కామాంబాకన్నయమంత్రీంద్రకుమార, పవిత్ర హరిత గోత్రాలంకార కృష్ణామండల మండనాయ మానాల్లూరగ్రహార పూర్వార్జిత ధరావిరాజమాన, శ్రీవీరప్రతాప కోర్కొండహంవీర రామచంద్ర భూమీశ్వరదత్త గోదావరీమండలస్థిత, సీతారామపురార్థభాగ పరిపాలనాధీన, పూర్వోక్తోభయమండల న్యాయసభావాదక నియోగభారవ్యవహార, శ్రీ వేంకటేశ్వర వరప్రసాదసంభూతకవిత్వ విద్యావిశేష బాల్యాదిరచిత త్రింశత్ప్రత్యేకగ్రంథ మతిసార, విబుధ జనకరుణాసంపాదితోభయభాషా పరిచిత ప్రచారనిత్య, శ్రీరామామాత్య ప్రణీతంబగు శ్రీ దేవీభాగవతం బను మహాపురాణంబునం బ్రథమస్కంధము.

ప్రథమస్కంధము సంపూర్ణము.