పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

95



   నరుఁడు గృహస్థుండై యుండియు శాంతుండై నిస్పృహుండై శీతోష్ణంబుల నేకరీతి సహించుచు
   నిజకర్మోపాత్తలాభంబునకుఁ దృప్తుండగుచు నాశాపిశాచంబుపాలుగాక మెలఁగెనేని వాఁడె
   జీవన్ముక్తుండగు నిందున కేన యుదాహరణభూతుండ. మరియు విను మో బ్రాహ్మణకుమారోత్తమా
   సుఖదుఃఖంబులకుం గారణంబైనది. మనంబకదా. మనంబు నడంపంగలుగు వాడె ముక్తుం
   డింతియె గాక.
674

క. సందేహమేల యోముని | నందన బంధనము మోక్షణంబునుఁ జూడన్
   డెందము వలనన కలుగున్ | డెందము వడియడగ నలజడింబడ డెందున్.675

క. మనసే సుఖముల జేయుఁన్ | మనసే దుఃఖములఁ జేయు మనుజులకెల్లన్
   మనసే బంధము సుమ్మీ | మనసే మోక్షంబునకును మార్గము తలఁపన్.676

ఆ.వె. వీఁడు శత్రుఁడంచు వీఁడు మిత్రుండంచు | దలచు టెల్ల మనసు వలనగాదె
   ద్వైతబుద్ధి భిన్నధర్మంబు చూపు న | ద్వైతబుద్ధి భేద వార్తఁగనదు.677

సీ. ఆత్మజ్ఞ యేకమేవాద్వితీయంబ్రహ్మ యను తత్త్వమెరిగి నే ననుసరింతు
   సంసారమున భేద సంఖ్య లేర్పడఁ జూచునంతకాలము బంధ మమరియుండు
   భేదమెచ్చటలేదు లేదు లేదనునాడు బంధవిచ్చేదంబు బడయవచ్చు
   సొరది భేదములేనిచో బంధమునులేదు నెరినెండ లేకున్న నీడయున్నె

తే.గీ. పురుషు డజ్ఞానమును బోవమొత్తెనేని | సహజసుజ్ఞానమున మనశ్శాంతిఁగలిగి
   సకలమును బ్రహ్మమని చూచి చలుడుగాక | పూని సంసారియయ్యును ముక్తిబడయు.678

తే.గీ. వేదవిహితక్రియాదులు వివిధ ధర్మ | వృత్తులకు మానరా దన్యవృత్తిబూన
   రాదు లోకార్థమెందు కీబాధ యనినఁ | బరమపాషండునకు ముక్తిపథముసున్న.679

వ. అనిన విని శుకుం డిట్లనియె.680

తే.గీ. అయ్యయో వేదములు హింసకాదికార | ణములు మోక్షంబు నీసమర్థములె చెపుమ
   కన ననాచారభూయిష్ఠ మనగ నొప్పు | సోమపానంబు దలపవచ్చునె మునీంద్ర.681

తే.గీ. పశువుగోయుట మాంసంబు భక్షణంబు | సేయుట సురను ద్రావుట హేయమైన
   జూదమాడుట గూడునంచును వచించు | నట్టి సౌత్రామణిని నమ్మనర్హమగునె.682

క. మును శశబిందుండనియెడి | జననాథుఁ డనేక యజనశాలి యగుచు ధ
   ర్మనిరతి ననేక దక్షిణ | లను భూసురులకు నొసంగె లలితి విభూతిన్.683

తే.గీ. చర్మములు పేరి పర్వత సమములయ్యె | నమితమేధోదకప్లావనమునఁ జేసి
   యొనరఁ జర్మణ్వతీనది యుదితమయ్యెఁ | బేరువహించె భువి శశబిందు డనఘ.684