పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

శ్రీ దేవీ భాగవతము

ఆ.వె. నన్నుఁ ద్వద్వియోగ ఖిన్నుఁజూడుము నాకు | వన్నెవాసిఁ దెచ్చు వాఁడవైన
     నెన్నటికిని భేద మొన్నంగఁబోకు నా | యన్న వేదపఠన మున్నదికద.618

క. అని పలికిన తండ్రికి వం | దనమును గావించి మఱి ప్రదక్షిణముగఁ దాఁ
     జని చనియెన్ విలువిడిచిన | సునిసితబాణంబు వోలె శుకుఁడు మిథిలకున్.619

చ. చని చని మౌనిబిడ్డ తరుజాలవిశాలవనప్రదేశముల్
     కనికని తప్యమానముని గమ్య గుహావళి విశ్రమస్థితుల్
     గొనికొని యాజకప్రతతి క్రుమ్మఱుచోటుల వేదనాదముల్
     వినివిని యచ్చటచ్చటను వింతమతంబులవారి నవ్వుచున్.620

తే.గీ. ఆ మహామతి వర్షద్వయమున మేరు | నవల హాయనమునకు హిమాచలంబు
     దాటి మిథిలాపురంబు మధ్యంబు సేర | నచటఁ గావలియున్న వాండ్రడ్డగించి.621

వ. ద్వారపాలకు లెదుర్కొని నీవెవ్వండవు నీ వేల వచ్చితివి? 622

క. అను పల్కును విని శుకుఁ | డత్యనఘుఁడు నగరంబుద్వార మవ్వలదరి నే
     మనక మఱుమాట సెప్పక | పనిఁ గొని తనలోన తాన పకపక నగియెన్.623

వ. అది కని ప్రతీహారుండు.624

తే.గీ. మూఁగవా మాటలాడవు మునికిశోర | యూరకే రారు మీవంటి వారలెందు
    నరపతి యనుజ్ఞ లేనిదీ నగరుసొరఁగఁ | జాల రఙ్ఞాత కులధర్మ శీలురనఘ.625

తే.గీ. భాసమానముఖప్రభా పటలికేక | వెట్టు బ్రాహ్మణుఁడవు వేద విత్తముఁడవు
    నీవనుచుఁ గులకార్యంబు లేవిధములొ |తెలుపుమీ శంకలేదు యథేచ్చఁజనుమి.626

వ. అనిన.627

తే.గీ. ఓయి ప్రతిహార! నీ మాట యొకటెచాలు | వాకిటనె సమకూఱె నే వచ్చినపని
   యేమని వచించెదో విను మీ విదేహ | పత్తనము సొచ్చుటది దుర్లభంబ యంటి.628

వ. అని శుకుండు తనలో 629

శా. ఆహా యెంతటి వెఱ్ఱినైతి సురశైలాయామముం గొల్చి శీ
    తాహార్యంబును దాటి కాల్నడ విదేహద్వారముం జేరితిన్
    మోహావేశము తండ్రిమాటవలనన్ ముంచెంగదా నన్ను వి
    ర్ద్రోహస్వాంతతనుండనైతి నెవనిం దూషింతు నాకర్మమే.630

చ. ధనమును గోరి లోకమునఁ దాఁ దిరుగుం బురుషుండు నాకు లే
    దనయము నట్టి యాశ నది యట్లయినం భ్రమ మావహించి యిం
    దున కరుదేరనయ్యెఁ గడు దూరమునుండియు మేరువేడ యీ
    జనకుని మేడ యేడ ఫల సంగతి యేమి హుళిక్కి యింతయున్.631