పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

89

క. వగరనియుఁ గారమనియును | దగమధురంబనియుఁ దీక్ష్ణ తాగం బనియున్
   మిగులంగాఁ జేదనియును | వగనుప్పనియును దెలియక వర్తిల వశమే.606

క. ఇది చల్లని దిది వేఁడిది | యిది మంచిది యిదియుఁ జెడ్డ దిది కూడదటం
   చద నెఱుఁగక సంసారము | కుదురుగ నెట్టంగఁ గలడె కోవిదుఁడగుచున్.607

తే.గీ. వీఁడు మిత్రుండు వీఁడు నా ద్వేషి వీనిఁ | బ్రోవఁదగు వీని శిక్షింపఁ బోలు ననెడి
   మది యొకింతయు లేక యెమ్మాడ్కి నతఁడు | రాజ్య మొనరించునొక్కొ యబ్రంబు కాదె.608

తే.గీ. సర్వసమదర్శనుండగు జాడయెట్లు | వీఁడు చోరుండు వీడు పవిత్రమౌని
   యనుచుఁ బరికింప కెట్లు పాలన మొనర్చు | ముక్తుఁ డగుటకు సంసారి శక్తుడగునె.609

వ. అని శుకుండు మిథిలాప్రయాణంబు సేసెనని చెప్పి సూతుండు శౌనకాదుల కిట్లనియె.610

తే.గీ. అని వచించి శుకుండను వ్యాసమౌని | యంఘ్రులకును నమస్కార మాచరించి
    కేలు మోడిచి గురుభక్తి గీలుకొనఁగ | నిట్టులని పల్కె సంతసం బుట్టిపడఁగ.611

-: శుకుండు మిథిలాగమనంబు సేయుట :-


చ. జనకమహర్షి యేలుబడి చాలఁ బ్రసిద్ధి వహించి మించి మేల్
    గను మిథిలా పురంబునకుఁ గ్రచ్చఱ నేగెద నీ యనుజ్ఞ గై
    కొని యది చిత్రమయ్యె జనకుండును దండము లేక భూతలం
    బు నెటులు బ్రోచునో నయము పోవదె దండము లేక యుండినన్.612
  
ఆ.వె. ధర్మకారణంబు దండంబ యనుచు మ | న్వాదులైన ధర్మవేదు లనిరి
    జనకుఁ డెట్టి మహిమఁ గొని చేయునో భూమి | పాలనంబు తెలియఁజాలఁ దండ్రి.613

క. తనుఁ గన్న తల్లి గొడ్రా | లనినట్లే యున్న దిది మహాద్భుత మయ్యెన్
    గనఁ దలతు జనక భూజా | నిని ననుఁ బంపుము మునీంద్ర నియమాతంద్రా.614

ఉ. నావిని వ్యాసమౌని కులనాథుఁడు బిడ్డనుఁ గౌగలించి నే
    దీవన లిత్తు నీకనుచు దివ్యవచోవిభవంబునం జిరం
    జీవ సుఖీభవ ప్రశమ చింతన హే శుక యంచుఁ బల్కుచున్
    నీ విఁకఁ బొమ్ము పోయెదవు నీవు సరే యొక బాస గోరెదన్.615

క. ఆబాస యేది యనినన్ | బాబూ నీ వచటనుండి పరభూములకున్
    బోఁబోకుము మరలం గా | రాబమున మదాశ్రమము సొరన్ వలయుఁజుమీ.616

ఆ.వె. చిన్న బిడ్డ నీదు చిన్నారి నెమ్మోము | కన్నులారఁ జూచు కొన్నఁజాలు
    నిన్నుఁ జూడకున్న నిల్చునే ప్రాణముల్ | తన్నుకొనవె మిన్ను మన్నుఁగనక.617