పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

శ్రీ దేవీ భాగవతము

తే.గీ. పతితపావనచరిత మీ భాగవతము | పరమవైదికమార్గ మీ భాగవతము
     పాశములనెల్ల ఖండించు భాగవతము | పఠనచే మోక్షమునొసంగు భాగవతము.593

తే.గీ. సాటి శిష్యుండు లోమహర్షణసుతుండు | వీఁడు నీవునుఁ జదువుండు కూడి మిగుల
     వేడుకలరంగ నే జెప్పు విధము దెలిసి | పంచలక్షణమైన యీ భాగవతము. 594

వ. అని చెప్పి సూతుండు శౌనకాది మహామునులకు మఱియు నిట్లనియె.595

క. నేనును శుకుడును మహితా | నూననియమముల వహించి యొప్పుగ నమిత
     జ్ఞానదమగు భాగవతము | పూని పఠించితిమి సర్వమును మునులారా!596

ఆ.వె. చదివి చదివి శుకుడు సంగవాంఛ నడంచి | కర్మధర్మములను గలయబోక
    బ్రహ్మకొడుకుఁబోలె బాహ్యాంతరమ్ముల | మఱచి వ్యాసు నాశ్రమమున నుండె.597

క. తినఁ డెక్కువ యుపవాసం | బును జేయం డింద్రియముల మోసమెఱగి యి
    చ్ఛను బోనీఁ డాత్మజ్ఞత | ఘనుడై గణనీయ యోగికరణిం దిరుగున్. 598

వ. ఇట్లత్యంత చింతాభరంబునం దిరుగు శుకునింగాంచి వ్యాసుం డిట్లనియె.599

మత్తకోకిల. ఇంతచింత మనంబునందు వహింపనేటికి బాలకా
     సంతసంబుననుండి జ్ఞానవిచారమేటికిఁ జేయ వీ
     వంతఁ గుందెద వెప్డు సూచిన వల్దు వల్దు ఋణవ్యధా
     వంతు రీతిని నిన్నుఁ జూచినవారు జాలిని దూలగన్.600

తే.గీ. నేను చెప్పిన మాటల నీకు శాంతి | గలుగదేనియు మిధిలా నగరమునందు
     జనకరాజర్షి గలఁడు వే చనుము పుత్త్ర | ధర్మపరుఁ డాతఁ డెఱిగించుఁ తత్త్వమెల్ల.601

ఉ. ఆ జనకుండు యోగరతుఁ డద్భుతతత్త్వవివేకశాలి యే
    యోజఁ దలంచినం బ్రతికియుండియు ముక్తుఁడు నీకుఁ దెల్పు న
    వ్యాజకృపామతి సకలవర్ణవిభాగము లాశ్రమస్థితుల్
    వేఁ జనుమంచుఁ బల్క, విని విస్మయమంది శుకుండు దాననున్.602

తే.గీ. తండ్రి వింతాయె నాకు నింతయును విన్న | జనకరాజర్షి రాజ్యంబు సల్పుచుండె
    జ్ఞానియై ముక్తుఁడై యుండగలఁడె వాని | మహిమ మరయంగ నాకును మనసుపుట్టు.603

క. తినినది తిననిది యెట్లగు | వినినది విననిదగుటెట్లు వేడుకతోడన్
   గనినది కననిది యెట్లగు | ననినది నననిదియు నెట్టులగు నా తండ్రీ.604

క. తల్లి యనియుఁ గొడుకనియును | బిల్లయనియుఁ దమ్ములనియుఁ బెండ్లామనియున్
   జెల్లెలనియుఁ గులటయనియు | జెల్లునె భేదములు జ్ఞానశీలుర కెందున్. 605