పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

శ్రీ దేవీ భాగవతము


క. వనితయుఁగా దిఁక మందిర | మునుగాదు మనంబె బంధమునకున్ మోక్షం
   బునకుం గారణ మిది తెలి | సి నటింపందగునుసూవె చిన్నికుమారా.520

క. న్యాయార్జిత విత్తమ్ము స | హాయత మనుచుండు శ్రుతిచయంబులవలనన్
   దాయని ధర్మము లెఱుగును | ద్రోయఁడు సత్యంబు ముక్తి రోసినయేనిన్.521

ఆ.వె. బ్రహ్మచారియైన వనవాసియైనను | యతికులేంద్రుఁడెన నతిథి యగుచు
   గృహుల నాశ్రయింప కెట్లు జీవింతురు | గృహమె యాశ్రమముల కెల్లఁ బెద్ద.522

తే గీ. శ్రద్ధతో నన్నదానంబు సలుపవలయు | సూనృతము నొక్కయపుడేని మానరాదు
   చేరి ప్రజలకు సుపకృతి సేయవలయు | నవనిలోనను గృహమేధియైనవాడు.523

తే.గీ. ఆలయాశ్రమమునకంటె నధికమైన | యాశ్రమము లేదుసూ వసిష్ఠాదులైన
   జ్ఞానవంతులు దాపసుల్ దాని నాశ్ర | యించి రిది వేదవిదులు మన్నించిరనుచు.524

తే.గీ. శ్రుతిహితంబుగఁ గర్మసంతతియొనర్చు ! జనులకును స్వర్గమోక్షము ల్సాధ్యములగు
    కాంక్షితంబులు సేకూరుఁ గార్హ్యమైన | యాశ్రమంబునఁ గలుగనియట్టి దున్నె.525

తే.గీ. ఆశ్రమమునుండి యాశ్రమం బందవలయు | నని మహాత్ములు దెల్పుదు రదియు గాన
    నగ్ని నర్చింపు మిఁకను యథార్థలీల | సర్వమును నందయున్నది సత్యమరయ. 526

క. గృహియై యాఁదట వనమున | బహులవ్రతశీలుఁ డగుచు వసియించి తుదిన్
    మహితమగు పరివ్రజ్యా | సహితుండగు టొప్పు వేదసమ్మత మిదియే.527

ఆ.వె. భార్య లేనినాడు భరములై యింద్రియ | ములు గలంచు మనసు బలిమిఁజేసి
    వాని గెలుచుకొరకు వసుధపై మనుజుడు | దారసంగ్రహింపఁ దగునటండ్రు.528

సీ. ఘనుడు విశ్వామిత్రు డను రాజఋషి తొల్లి యత్యుగ్రమగు దపం బాచరించి
    మూఁడువే లేండ్లు నిర్మోహుఁడై యింద్రియముల గెల్చి నిష్ఠమై నిలచియుండ
    దేవతానటి మేనకావధూటినిఁ గాంచి తమిఁ జెంది కామతంత్రముల జిక్కి
    తతకీర్తియగు శకుంతల యను నొక యాఁడుబిడ్డను గనియె నీ పృథివి నింక

ఆ.వె. దాశకన్యయైన తాలిని వలచి క్ర | న్నన పరాశరుండు నన్ను గాంచె
    నజుఁడు స్వసుతఁగూడె నది కాన నీవును | బ్రీతిఁ గులజ నొకతెఁ బెండ్లి గొనుము.529

వ. అనిన విని నిసర్గ నిరీహుండైన శుకుం డిట్లనియె.530

 

-: శు క కృ త సం సా ర నిం ద :-


ఉ. పట్టగు వాగురాసదృశ బంధన మెల్లరకుం గృహంబు నే
    గట్టిగ నొల్ల నొల్లను సుఖప్రతిబంధక మింతె కాదు స్వా
    రాట్టయినం ధనాశను దిరంబుగ దుఃఖమ పొందుఁ దృప్తుఁడౌ
    నట్టిడు భిక్షకుండు సుఖ మందును నిస్పృహఁజేసి ధీనిధీ.531