పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

81


ఉ. అయ్య మనుష్యలోకము నిరామయమై సుఖసాధనంబునై
    తియ్యముసేయునే వసట దీరునె ప్రాజ్ఞులు దాని మెత్తురే
    తొయ్యలి నొక్కదాని మెడ దుంగను గట్టుక తద్వశుండ నై
    కయ్యను బడ్డ దున్నవలె కా ల్గదలింపఁగనేర నయ్యయో. 508

ఉ. సంకిలిఁ బడ్డవాని కొకసారి విముక్తి ఘటించుఁగాని బి
    ట్టంకిలి నీషణత్రయమునందుఁ దగుల్కొనినట్టివానికిన్
    శంకరుఁడైన ముక్తి నిడఁజాలఁడు భామలపొందు చెల్లునే
    సంకట మంచుఁ బ్రాజ్ఞు లనిశంబును దానిఁ ద్యజింతు రుర్విపైన్.509

ఆ.వె. ఏ నయోనిజుండ నెట్లుగా యౌనే య | సుఖముఁగోరువాడ సూరివంద్య
    భయముదోఁచు మూత్రమయము విణ్మయమునౌ | నంగసంగ సుఖము నందదగునె.510

ఆ.వె. ఆత్మసుఖము మాని యానందమునుఁ ద్రోచి | జ్ఞానమెల్ల మంటఁగలిపి మాయ
    లోనఁ జిక్కి విడ్విలోలకీటంబనై | యెట్లు బ్రతుకువాఁడ నీ జగమున.511

క. చదివించె నన్ను వేదము | త్రిదశగురుం డతఁడు సూవె స్త్రీలోలుఁడు నా
    కొదవించునె సుజ్ఞానము | వదలక రోగికిని రోగి వైద్యుండాయెన్.512

ఆ.వె. చెప్పి చెప్పి విసికెఁ జెప్పిన దంతయుఁ | బుట్టిపుట్టి మరల పుట్టునట్టి
    చెట్టహింసలకును బట్టైన కర్మముల్ | గట్టిసేయు మనుచుఁగాదె తండ్రి.513

క. ఈ సంసారము నాకే | లా? సారెకు సారె దిరిగినట్లే తిరుగన్
   వేసారుటకే యీ యా | యాసము పడనోప నోపనయ్య మహాత్మా.514

ఉ. వేదము లెల్లనుం జదివి వెంగలియై సురతాశఁ గామినీ
    పాదము లాశ్రయించుఁ గులపాంసుఁడు గణ్యుఁడె పండితుండె యే
    భేదము కుక్కకుం జెవులపిల్లికి బందికి జ్ఞానిగాని యా
    వైదిక పండితాగ్రణికి వై ళమ తెల్పుము సంయమీశ్వరా.515

క. మానవజన్మము దుర్లభ | మైనదనుచు నెఱిఁగి యందు సత్యాదరమున్
    బూనక సంసారి యయిన | మానవునకు ముక్తిగలదె మహిలో నెన్నన్.516

క. మాయాగుణమగు సంసా | రాయాసము లేనివాఁడె యాత్మజుఁడున్ వి
    ద్యాయుతుఁడు శాస్త్రపారగుఁ | డేయెడ నీ బాధ్యు డాతఁ డీశ్వరుఁడుసుమీ.517

క. కంకణము గట్టి వేదము | శంక యొకింతయును లేక చదివి చదివి మీ
    నాంకుని వలఁబడు భూదే | వాంకితులకుఁ గట్టు వడలు టది యెట్టులొకో.518

వ. అనిన విని పరాశరతనూజుండు నిజతనూజున కిట్లనియె.519