పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

శ్రీ దేవీ భాగవతము

క. బుడుతం గని ముని యచ్చెరు | పడి యిది యేమనుచుఁ గొంత పరికించి పదం
   పడి గంగాజలములఁ గడు | వడి జలకముఁ దీర్చి పుత్త్రవాత్సల్యమునన్.496
  
తే.గీ. జాతకర్మంబు మొదలుగా జరిపి మౌని | శివుని వరమునఁబుట్టిన చిన్నబిడ్డ
   డంచు గారాముసేయుచు మించెనంత | సురలు దివి పుష్పవర్షముల్ కురిసి రోలి.497

ఉ. నారద తుంబురుల్ మధుర నాదముల న్మృదుగానవైఖరీ
    ధీరతఁ బాడి రచ్చరలు తెత్తెయియంచు నటించి రంతటన్
    జారెను మింటనుండి యజినంబు గమండలు వొక్క దండమున్
    బాఱులరేని కుఱ్ఱనికిఁ బాయని కానుకలై ధరాస్థలిన్. 498

తే.గీ. అరణి మథియింపఁబుట్టిన యమ్మునీంద్ర | బాలునకును శుకీరూప మోలిదాల్చి
    యున్న యూర్వసి యమ్మౌని యునికిఁగానఁ | బడినకతమున శుక నామ మిడిరి ద్విజులు.499

వ. అంత శుకుండు దినదినప్రవర్ధమానుండై యతిలోకచతురతాసంపన్నుం డై యొప్పుడుం
    గని సాత్యవతేయుండు బృహస్పతిచే బ్రహ్మచర్యవ్రతంబు నెరపించి వేదవేదాంగంబు
    లధ్యయనంబు సేయించి నిండువేడుక నొక్కనాఁడు కొండికా యిటు రమ్మని తొడ
    చక్కిం గూర్చుండ నిడి చుబుకంబు పుణికి శిరంబు మూర్కొని నాయనా నీవు సకల వేద
    వేదాంగంబులు సదివితివి గురుదక్షిణ ఇచ్చి సమావర్తనంబుఁ గడిపితివి. యిట మీఁద. 500

ఆ.వె. పట్టి పెక్కునాళ్ళఁ బట్టి పట్టిన నోము | గట్టితనము చేత గట్టుపట్టి
      చెట్టఁ బట్టినట్టిదిట్ట వరమ్మున | బుట్టితివి వరాలపుట్టి వగుచు. 501

క. దేవ పితృదేవ ఋణములు | వేవేగమ తీర్చివేయ వే యజనులన్
   నీ విఁక గార్హస్థ్యము స | ద్భావమునకుఁ దగిన మంచి భార్యంగొనుమీ.502

క. సుతులఁ గనని వారలకున్ | గతులే లేవండ్రు స్వర్గ కాంక్ష హుళిక్కే
   యతులమతిని సతినొక్కతె | నతికించుక యుండు మీ గృహాశ్రమ మందున్.503

వ. ఇవ్విధంబునం బలుకు నతిరక్తుం డగు వ్యాసునకు నతివిరక్తుం డైన శుకుం డిట్లనియె.504

తే.గీ. తండ్రి తత్త్వంబెఱింగి యే దారి నాకు | మంచిదని నీవు తెల్పెదో మాన దాని
    చెప్పు మెయ్యది సౌఖ్యసంసిద్ధిమూల | మెందు దుఃఖంబు సొరకట్ట దింతయేని.505

తే.గీ. అనిన విని వ్యాసుఁ డనుప్రియతనుజ వినుము | శివునివరమునకా నీవు సేకురితివి
    భూపతిని గొల్చి విత్తంబు పొందుపఱచి | యిచ్చెదను సౌఖ్యమునకు నీ కేమిగొదువ.506

వ. అనిన విని సవినయంబుగా మెల్లమెల్లన శుకుం డిట్లనియె.507