పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

శ్రీ దేవీ భాగవతము

    త్కాతరనేత్ర తా వలచి కందువమాటలతోఁ బురూరవున్
    బ్రీతునిఁ జేసి యిట్లనియె మెల్లనఁ జల్లనిదృష్టు లల్లుచున్. 477

తే.గీ. అంగసహితుండవై న యనంగమూర్తి | వగుదు విరిసింగిణియు మకరాంక మిడిన
    ననుచు నవమల్లికాప్రసూనాళిఁగోసి | చేతి కందిచ్చి మకరికల్ చెదర జూపె.478

ఉ. అంతట రాజు న మ్ముగుద నప్పుడ తెప్పునఁ గౌఁగిలించి యా
    కంతుఁ గృతార్థుఁజేయ సమకట్టుచుఁ జేరఁగ రాఁగఁ జూచి యొ
    క్కింత తొలంగి యో మనుజకేసరి కక్కురి తింత యేల నీ
    యంతటివాని కొక్క సమయంబున కీ వొడఁబాటు సేయుమా.479

వ. ఆసమయం బెద్ది యనిన నీ యురణకంబుల రెంటిని నీవు రక్షించుటయు ఘృతము తక్క
    నే నితరాహారంబు కైకొనకుండుటకు మైథునకాలంబునంద కాని యితరవేళల
    వివస్త్రుండ వైన నిన్ను నేను జూడకుండుటయు నను నీ మూడు కట్టుబాటులకు నీ
    వొడంబడుము. ఎన్నఁడు నీ పొరబాటున నీసమయంబు తప్పి చను నాఁడ సన్ని నే
    విడిచి పోఁగలదాన ననిన విని పురూరవుం డందున కియ్యకొని కొంతకాలంబు యథేచ్చన్
    మదనకళాకుశలుండై యూర్వశిం గూడియుండె.480

చ. ఘనుఁడగు పాకశాసనుఁ డొకానొకనాడల యూర్వశిన్ మనం
    బునఁ దలపోసి యయ్యలరుబోడి సుధర్మను లేమ యెప్ప దల
    చని సురగాయకాగ్రణుల కయ్యతివం గొనితేర భూమి కిం
    కనుఁ జనుఁ డందు మున్నురణకంబుల దొంగిలుఁ డంచుఁ బల్కినన్. 481

క. విని పిమ్మట విశ్వావసుఁ | డును మఱికొందఱును జని కడుం జీఁకటివే
    ళను దారురణకముల వే | కొని పాఱిరి రాజు పడఁతిఁ గూడెడి వేళన్.482

క. ఉరణకములు పెల్లఱచిన | రమణీమణి యాలకించి రాజన్యునితో
    నరవర సమయము దప్పితి | వరుగు మురణకములఁ బట్టు మతిరయముననాన్. 483

తే.గీ. జనవిభుం డప్డు తన వివస్త్రత నెఱుంగ | లేక వేగము చనుచుండ నాకవాసు
    లరిది మెఱుపులు మెఱయున ట్లాచరింప | వెలుగులో నగ్నభూపతి న్వెలది కాంచి.484
 
ఉ. చూచి లతాంగి నాకిదియ సూ సమయం బని మించి దిగ్గరన్
    లేచి చనెన్ నృపాగ్రణి కడింది మెయిం దముఁ జేరఁ బ్రక్కనే
    కాచుకయున్న వా రురణకంబులఁ ద్రోచి చనంగ ఁ దెచ్చి ప్రే
    మోచిత వృత్తిఁ జేరియుఁ దలోదరిఁ గానక దుఃఖితాత్ముడై. 485

తే.గీ. దేశ దేశంబులను దిమ్మఁదిరుగ దిరిగి | యెక్కడికిఁ బోతివో యంచు నేడ్చి యేడ్చి
    యడవిలో నున్న మ్రాఁకుల నడిగియడిగి | యెందునుం గాన కాత్మలోఁ గుందికుంది.486