పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆం ధ్ర దే వీ భా గ వ త ము

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

పీఠిక

ఆన 1000 సంవత్సరారంభమున గ్రంథకర్త దేవీభాగవతాంధ్రీకరణము నారంభించి ఐదుమాసములలో నాపని పూర్తిచేసి శుద్ధప్రతి నొకదానిని స్వహస్తమున వ్రాసి ముద్రణ కొసఁగిరి. కాని యా సమయమున వారి స్వకీయ ముద్రాక్షరశాలలో సర్కారు పను లధికముగ నుండుటచేతను, ముద్రాయంత్ర పరికరములు మితముగ నుండుటచేతను, నీ గ్రంథము తమ ముద్రణాలయమున ముద్రించుట కవకాశము గలుగదయ్యె.

కావున నితర ముద్రణాలయములలో నీకార్యము నిర్వహించవలసిన యావశ్యకత కలిగినది. ఆకారణముచేత గ్రంథము 1907 వ సంవత్సరమువరకు బయలువెడల వలను బడలేదు . అప్పటికొక సంవత్సరమునకు ముందు గ్రంథకర్తకు శరీరమందు జాడ్యమేర్పడెను, సవరణ పత్రములను మిక్కిలి జాగరూకతతో జూడ శక్తి చాలక యుండెను.వారి శరీరము నానాటికీ స్వాస్థ్యము తప్పుచుండుటయు, ముద్రణ మాలస్యముగ జరుగుచుండుటయు, తెలిసికొని వెంటనే యప్పటికి ముద్రితముగాక నిలచి యున్న చివరి యైదు స్కంధములు తమ ముద్రణాలయముననే పని జరుగునట్లేర్పాటుచేసిరి.

ఈ గ్రంథముయొక్క ముద్రణము ముగిసిన పదిమాసములతో గ్రంథకర్త మృతి చెందెను. సావధానముగ నీ గ్రంథమును తిరిగి పరిశీలించుటకుగాని ముద్రణా స్ఖాలిత్యములను బరికించుటకుగాని తగిన యవకాశము గ్రంథకర్తగారి జీవిత కాలమున వారికి జిక్కకుంటచే నిందు నచ్చటచ్చట గొన్ని లోపము లుండునేమో యని శంక పొడమినది. అట్టి లోపములెచటనైన గాన్పించినచో చదువరులు వానిని మాకు దెలుప బ్రార్థితులు.

మొదటి ముద్రణ మితరస్థలముల యందు జరిగిన కారణము చేతను, చిన్న యక్షరములతో గూర్పబడి యుండుటచేతను జదువరుల కంటి కింపుగ నుండలేదు.

ఇప్పుడు పెద్ద యక్షరములలో గూర్పబడి విలుపగల మంచి కాగితములపై ముద్రింపబడినది.

ఈ గ్రంథము యొక్క కవితారచననుగూర్చియు, కవియొక్క ప్రజ్ఞావిశేషములను గూర్చియు, నిందు ముద్రింపబడిన బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శతావధాని గారి యుపోద్ఘాతమే చెప్పుచున్నది. కావున వేరుగ వ్రాయ నవసర ముండదు .

బెజవాడ 1-10-1928.

దా సు కే శ వ రా వు