పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

శ్రీ దేవీ భాగవతము


క. అట్టులనె పుట్టరాదా | పట్టి యొకఁడు నాకు నటులు పాటిల్లదొ యీ
      పట్టునఁ బుత్త్రారణి నా | పట్టున లేదాయె నెట్లు భామ నొనర్తున్.346

తే.గీ. రూపుగలదాని బెనిమిటి ప్రాపుదానిఁ | గాపురముఁ జక్కనొత్తంగ నోపుదానిఁ
      బాపపూఁపలఁ గనుదాని బడఁతినోర్తు | గలుగఁజేసినఁ గాలి సంకలియ కాదె. 347

ఆ.వె. జాయ దక్షమైనఁ జక్కని దైనఁ బ | తివ్రతామహిమలఁ దేలియున్న
      మోయరాని పెద్ద బొండకొయ్యయ కాదె | శివుఁడె యువతి వలనఁ జిక్కిచిక్కె.348

క. అట్టి గృహాశ్రమమును నే | నెట్టులఁ గైకొందు ననుచు నెరియుచునుండన్
      నెట్టన ఘృతాచి యను నొక | నట్టువగత్తియ విలోకనంబునఁ దోచెన్.349

చ. గగనమునందు వేలుపుల కన్నియ చిన్నియ యెంతయేని సొం
      పుగఁ గనుపట్టె నందముల మూటయి నేటగు నీటుమీఱు పల్
      వగలకు సూటియైన పెనుబాటయి మాటల తేటలన్ నిజం
      బుగ నమృతంపు టూటయయి పోటయి చూపఱ మానసంబులన్.350

క. ఆ వగలాడిం గనుఁగొన నా | వలఱేఁ డా పరాశరాత్మజు నేయన్
      జేవచెడి యువిదపైఁ, గామావేశం బొదుప నిట్టు లని చింతించెన్. 351

ఉ. ఈ విమలాంగిఁ గొన్న సుతు నిచ్చును గామము దీర్చునంచు నే
      నేవిధి దీనిఁ బొందఁగల నిప్పుడ నా సరివారు నవ్వరా
      భావజుబారిచే వలపు పాలయి వ్యాసుఁడు గూడె నచ్చరన్
      గైవసమైన వర్షశతకవ్రతపుణ్యము ద్రోచెనం చొగిన్.352

క. పోనిండు పాపమైనను, నే నింతి వరింతు ననివ నీ యచ్చర సం
      తానము సుఖదం బగునే | మానుగను గృహస్థ ధర్మ మార్గము బోలెన్.353
 
క. మును నారదుండు నాకున్ | వినిచెను ము న్నూర్వసి యను వెలఁదుకఁ జేప
      ట్టినవాఁడు పురూరవుఁ డను | జనవరుఁడు పరాభవమునఁ జనియె నటంచున్.354
 

-:బుధోత్పత్తి:-



వ. అని పల్కిన సూతుం గాంచి మహామును లిట్లనిరి.355

తే.గీ. క్షితి బురూరవుఁడను ధరాపతి యెవండు | తెలియ నూర్వసియనునట్టి చెలియ యెవతె
       యెట్టు లాబోటి నారాజుపట్టి కలసె | సకలమును దెల్పు రోమహర్షణ తనూజ. 356

చ. అమృతముకంటెఁ దియ్యనగు నయ్య భవన్మృదుసూక్తి మాకు సం
       యమివర యెంత విన్నఁ దని వయ్యెడినే యన సూతుఁ డిట్లనున్