పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

65


ఆ.వె. నారదోక్తరీతి నమ్మి జపించేఁ బుత్రార్థి యగుచు నూరు హాయనములు
      శివునిఁ గూడియున్న సీమంతినిం గూర్చి | సాధ్విఁగూర్చి పరమశక్తిఁగూర్చి. 336

ఆ.వె. తిండి మాని పైడి కొండకూటమ్మున | నుండి చేసెఁ దపము దండిమౌని
      నిండి భూతసమ్మితుండైన కొండిక | పండుఁగాకయంచుఁ బరమనిష్ఠ.337

సీ. గంధర్వగీతికా కలనంబు లెచ్చోట నెచ్చోటఁ గిన్నరీ హితకథాళి
      దేవర్షి కృత తపస్తేజంబు లెచ్చోట నెచ్చోటఁ ద్రిదశుల రచ్చపట్టు
      లాదిత్య వసు మరు దశ్విను లెచ్చోట నెచ్చోట మందార వృక్షసమితి
      పదియార్వవన్నియ బంగార మెచ్చోట నెచ్చోట రతనాల విచ్చురాళ్లు

తే.గీ. నచ్చరల నాట్య మొచ్చోట నమృతర సము | పాన మెచ్చోట సచ్చోటఁ బరమనియతి
      దనర బహుహాయనములు దుర్దాంత లీల | సత్యవతి బిడ్డ తపము దాసలుపఁ దొడగెఁ 338

ఆ.వె. తపమువలస నద్భుతంబైన తేజంబు | విశ్వమెల్ల నిండె వింత పొసఁగె
      వ్యాసు జడలు వహ్ని వర్ణంబులై ముంచె | బాక శాసనుండు భయముపడియె.339

క. భయవిహ్వలు నింద్రుని గని | నయమున రుద్రుండు నవంచిద్వేషీ
      భయ మేల నీకు నిప్పుడు | నియమంబులు మానుదురె మునిశ్రేష్ఠులిలన్. 340

ఉ. శక్తిని నన్ను నుందలఁచి సత్యవతీసుతుఁ డిప్డు దాఁ దపో
      యుక్తిని మించె గోస మిటు లూనఁగఁ బాడియె నావుఁడున్ సమి
      ద్ధోక్తుల నింద్రుఁడుం బరమయోగిజనార్చిత, పార్వతీప్రియా,
      ముక్తినిదాన, మౌని తపముం బచరించెడి నేల తెల్పుమా. 341

వ. అనిన.342

క. పారాశర్యుఁడు పుత్రుం | గోరి తపము సేయుచుండె ఘోరతరముగా
     నూరేండ్లు నిండె నొక్క కుమారుం దయసేయుదున్ బ్రమాగుణధీరున్.343

ఉ. నావిని యింద్రుఁడున్ దన మనంబున సంతసిలంగ నంత గౌ
     రీవిభుఁ డా మునీంద్రునకుఁ బ్రేమ మెయి స్వర మిచ్చెఁ బుత్త్ర స
     ద్భావము గల్గు లెమ్ము మహితస్థితి నీ కొడు కత్యుదారతే
     జోవిభవంబుచే నలరుఁ జుమ్మిక పొమ్ము మునీంద్ర నావుడున్. 344

చ. అది విని సంతసించి ముని యాశ్రమముం దగఁజేరి పుత్త్రసం
     పద యిఁకఁ గల్గునంచు నెద పూనిక సారణియైన గృహ్యమున్
     గుదురుగఁ దా మథింప దొరకొంచు మదిం దలఁచెన్ మహారణిన్
     వదలని మంథనంబున భవంబు దలిర్పదె హవ్యభోజికిన్. 345