పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

63


క. పిడిగ్రుద్దులఁ బొడచుచు సిరి యొడయఁడు మార్కొనిన నుద్ధతోద్యోగమునన్
   గడుపడి నెడనెడ సుడిఁబడఁ, బొడచిన యెడలేని కడఁకఁ బురుషోత్తమునిన్.311

క. పోటుదగిలి గోవిందుఁడు | దీటుగఁ బాటించుఁ బూర్వదేవులఁ గని ఝం
   ఝాటంబు దూలి వెల్లం, బాటొదవన్ దేవి వదనపద్మముఁ గాంచెన్. 312

క. వెన్నుని ఖిన్నువి నత్యా పన్నునిఁ గని దేవి కృపను బకపక నగి గ
   ర్వోన్నతు లగు దనుజుల పైఁ దిన్నఁగఁ గను లెఱ్ఱఁజేసి తిరమైనమతిన్. 313

ఉ. పాపులవంచనన్ మునుపఁ బాడియటంచుఁ దలంచి మోహినీ
    రూపముఁ దాల్చె నచ్చుత నిరూఢి జగజ్జన మోహనైక వి
    ద్యాపరతంత్ర యై లలిత యై నవయౌవన దర్శనీయ యై
    రూపవతీవతంస మయి రుద్రవిరోధికరాగ్ర ఖడ్గమై.314

క. ముఖము ఖము మెఱపు నిందుని | నఖము నఖము కౌను మిగుల సన్నము చెలికిన్
    నఖ మెన ఖగసంతతికిన్ | సుఖర ముఖర శుకరవములు సుందరి పలుకుల్. 315

క. బంగారము రుచిరాంగము | శృంగారము కృతకచేష్ట సీమంతినికిన్
    బొంగార ముద్దుమోవి సుధం గార ముందంబు మీఱఁ దా వలపించెన్. 316
 
క. నిందాస్పదుఁ డనుచుఁ జవితి | చందురునిం దూరు నిటలసౌందర్యము నే
    మందము మందము. పంకజ | మందము పదయుగళి కెనయె యా సుందరికిన్.317

క. అలలేవళు లా దృష్టుల | నలలేళ్లే గెలువఁజాల నక్షులు నగుఁ గ
    ల్వల లేమెఱుంగలను గని | మలలే కుచములు విలాసమహిమాన్వితకున్.318

వ. ఇట్లు జగన్మోహినియై తమ ప్రక్క నిలువంబడియున్న పడతింగాంచి తదీయ కుటిల
    దృక్పాతంబు లమృతధారా నేకంబు లగుచుం గడుంబొంగి యా రక్కను లిటు నటుఁ
    దిరుగుచు మిగుల మోహితులై యున్నతఱి వంచన కిదియె సమయంబని సురరిపులం
    గాంచి హరి యిట్లనియె.319

క. మీ వీర్యశక్తి మెచ్చితిఁ | జేవమెయిన్నన్నెదిర్చి చేసితిరి దుర
    మ్మే వరముం గోరెదరో  ! మీ వాంఛిత మిత్తు మేలు మే లడుగుఁ డిఁకన్.320

తే.గీ. దానవులు దాని విని యోరి దైత్యమథన | నీవు వరమిచ్చువాడవు నేఁడు మేము
    యాచకులమో భళీ తగు నౌర నీవె | కోరుము వరంబు చే సమకూర్తు మనిన.321

తే.గీ. దాని విని వెన్నుఁడలరి యట్లే నొనర్తు | తప్పఁగూడదు దేవవిధ్వంసులార
     మోహినీ దేవి సాక్షిగా ముఖ్యమైన యొక్క వర మిండు మిమ్ము నే నుక్కడంప.322

వ. అనినం దనుజులు విని. 323