పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

శ్రీ దేవీ భాగవతము


చ. నిఖిలముఁ బ్రోచువాఁడు గణనీయుఁడు సర్వగతుండు వేత్త చి
    త్సుఖపరుఁ డీశ్వరుం డమితసుందరుఁ డున్నత తేజుఁ డిందిరా
    సఖుఁడు నిరీహుఁ డుత్తముఁడు సౌమ్యుడు శాంతుఁడు యోగనిద్రచే
    నఖిలమునం దపస్మృతి బయల్పడ నజ్ఞతఁ గాంచే నయ్యయో. 251

క. తప్పక సందియ మను ముడి | విప్పి యధార్థంబు చెప్పి వేవేగ మముం
    దెప్పరమగు సంతసమున | దొప్పలఁ దోగించువారు దొరకుదురె యొరుల్.252

చ. సనకసనందన ప్రముఖసంయములుం గపిలుండు నారదుం
    డనుపమ బుద్ధిశాలులు మహామహులైనను మూలశక్తి స
    త్తును గన లేరు వేదములు తప్పక పల్కుచునుండు విష్ణుఁడే
    ఘనుఁడు శివుండె గొప్ప విధిగణ్యుఁ డటంచు ననేక భంగులన్.253
 
వ. మఱియు. 254

ఉ. కొందరు కేశవున్ బరమకోవిదుఁ డంచు సనాతనుం డటం
    చందురు, గొంద రీశ్వరుఁ డటందురు శక్తిసమన్వితుం డని
    ష్పందుఁడు భూతనాథుఁ డని పల్కుదు రింద్రుఁడు నాథుఁ డంచు నిం
    కం దిననాథుఁ డంచుఁ గణకం జ్వలనుం డని యండ్రు గొందరున్. 255

ఆ.వె. ఎంద రెన్నిగతుల నేమి చెప్పిన నేమి కార్యకారణములఁ గాంచు చోట
    సత్ప్రమాణములను సాధింపఁ గావలెఁ | గాక వే రొకండు గాదుఫక్కి. 256

క. మానక ప్రత్యక్షము నను మానము శబ్దంబు నను ప్రమాణంబులు మూఁ
   డౌ ననిరి కొంద ఱని రుప మానంబును ననుపలబ్ధి మఱి కల వనుచున్. 257

ఆ.వే. ఆగమంబు బుద్ధి యవల సద్యుక్తియుఁ | గార్యకారణ ప్రకారములకు
   ననుభవంబుమీఁద నల్ల దృష్టాంతంబు | రహిని గర్పి రా పురాణవిదులు. 258

క. పండితులు సెప్పుచుందురు | దండి పురాణముల యందుఁ దా నెవ్వేళన్
   నిండె జగంబుల నన్నిట , మెండుగ శక్తిస్వరూపమే యొం డనుచున్.259

ఆ.వె. విధికి సృజనశక్తి విష్ణుదేవునకును | పాలనైకశక్తి శూలి కెన్న
   హరణశక్తి పంకజాప్తునకుం బ్రభాశక్తి శిఖికి జ్వలనశక్తి కలవు.260

ఆ.వె. ఎల్లయెడల శక్తియే కనవచ్చెడి | శక్తి లేని యుత్త స్థలము లేదు
   సర్వగతము శక్తి శక్తి లేనప్పుడు | వస్తు వేడఁగలదు వసుధయందు.261

క. సర్వము శక్తి మయంబగు | సర్వజనులు శక్తి లేక శత్రుజయ శ్రీ
   నిర్వాహకు లెట్లగుదురు | సర్వోన్నత పదవి నందు శక్తియ కాదే.262