పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

57


క. జననీ పాపులఁ ద్రుంతువు | వినయపరులఁ బ్రోతు వఖిలవేదినివి కదా
    నిను మాన నా విపత్తిం | దునుమాడుము దుర్జనులకు దుర్గమ వమ్మా.241

క. ననుఁ గన్నతల్లి వని నే | చనువున మఱిమఱియు నిన్ను సంస్తుతిఁ జేయన్
    వినవమ్మా విడువక సజ్జనకల్పక చారువల్లి జగముల తల్లీ. 242

ఉ. నాటక సూత్రధారిణి వనాఁ దగు ముజ్జగమందు నీవ యే
    నాఁటను దృశ్యమానవు సనాతని వీశ్వరి వాదిమూర్తి వి
    చ్ఛాటనశీల వార్తుల భయంబులఁ దీర్చెడి పట్టున న్మణీ
    పేటివి భక్తకోటికి కృపీటభూములు సీర తేజముల్.243

ఉ. ఓ పరమేశ్వరీ విను మహో మొఱ యింతట లెమ్ము లెమ్ము నీ
    రూపము సూపు మమ్మ సితరోచిమరీచిక లీను నీ ముఖం
    బోపికఁ జూచి మ్రొక్కెద నయోన్నతి విష్ణుని వీడుమమ్మ నా
    యాపదఁ బాపుమమ్మ నిరతాయతచిత్రవిచిత్రవర్తినీ.244

క. అని యిట్లు బ్రహ్మ వేడిన | విని మాయాశక్తి హరిని విడిచి మఱొక ప్ర
    క్కను నిల్చిన నక్కారణ | మున హరిఁ గని యబ్జసూతి ముదితుం డయ్యెన్.245

వ. అనిన విని పరమశాంతపావనులగు మునులు పరమశాంతస్వభావసమేతు సూతుం గాంచి
    యిట్లనిరి.246

ఉ. అక్కజమయ్యె మాకు నహహా యిది విన్న మహానుభావ నీ
    వక్కణముల్ సదా విబుధవర్ణితముల్ విధి విష్ణు రుద్రులన్
    బెక్కుపురాణము ల్తెలుపు నిత్యులు నాద్యులు నంచు వారలే
    తక్క మఱొం డజాండముల దైవము లేదని నిక్కువంబుగన్.247

చ. అజుఁడు సృజించు మాధవు డనారతమున్ బ్రతికించు శంకరుం
    డు జగముఁ దూల్చు మువ్వురుఁ గడు న్నుతిఁ గాంత్రు త్రిమూర్తు లంచు స
    త్త్వజయు రజోజయున్ మఱియుఁ దామసి నాఁ జను శక్తులొందుటన్
    ప్రజలకు వేఱ యెవ్వఁ డిఁక బంధుఁడు లోకమునందుఁ జూడఁగన్.248

ఉ. వారలలో మురారి నిరవద్యతఁ దాఁ బురుషోత్తమాఖ్యచే
    మీఱి మహాప్రసిద్ధుఁ డగు మేటి జగత్పతి సర్వ కర్మలం
    గారకుఁ డంతవాని నిఁకఁ గాంతుమె? నిస్తులతేజుఁ డాతఁ డ
    య్యారె! తథావిధుండె యిటు లాయెనుఁ జిక్కెను యోగనిద్రకున్. 249

క. ఇది మాకు సవిస్తరముగ | విదితం బొనరింపుమయ్య విజ్ఞాననిధీ
    యది యే శక్తియొ మొదటికి | మొదలైనది విష్ణువునకు మూలమె చెపుమా.250