Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినుకొండ వల్లభరాయలు 215


ఈ వంశవృక్షమును బట్టి చంద్రామాత్యుని మంత్రిగా గైకొనిననాడు సంగమరాయల తండ్రియైన బుక్కరాయలేకాన్ సంగమరాయల కుమారుడైన బుక్కరాయలు కాడనియు, లింగన, తిప్పనలు రెండవ హరిహరరాయల యొద్దనే యుండిరనియు, స్పష్టమగుచున్నది. సంగమరాయల కుమారుడైన బుక్కరాయల యొక్క జందామాత్యుడు మంత్రియయ్యెనేని, ఆయన మునిమనుమడైన లింగన బుక్కరాయల కుమారుడైన రెండవహరిహరరాయల యొద్ద మంత్రిగా నుండుట యసంభవము. అందుచే జంద్రామాత్యుడు సంగమరాయల తండ్రియైన బుక్కరాయల యొద్దనే మంత్రిగాయుండినట్లు నిశ్చయింపదగియున్నది. అయితే ఆ బుక్కరాయల కాలము నాటికిగర్ణాటక రాజ్యము సంగమ వంశీయులలో లేదు. అనతి కాలము క్రీ.శ. 1250-1270 ప్రాంతమగును. అప్పుడు కర్ణాట రాజ్యము కాకతీయుల వశమందున్నది. ఆ పక్షములో పెద్ద బుక్కరాయలు గర్ణాటక్షితినాథుడెట్లగునని సంశయము కలుగవచ్చును. కాకతీయుల వలన గాని ఆ కాలమున గర్ణాటక దేశమును బరిపాలించుచున్న మరియే ప్రభువుల వలన గాని యీ బుక్కరాయలు కర్ణాటరాజ్యరక్షణమున నియోగింపబడియుండునని తలంపవలసియున్నది. తనతండ్రి, పెదతండ్రులు కర్ణాటప్రభువుల యొద్ద మంత్రులుగానుండుటచే దన పూర్వుడైన చంద్రామాత్యుడు కర్ణాట ప్రభువుల మూలపురుషుడైన బుక్కరాయల మంత్రియని కవి చెప్పియుండును. ఈ బుక్కరాయల మనుమడైన మొదటి హరిహర రాయల యొద్ద జంద్రామాత్యుని ముని మనుమడైన లింగన తిప్పనలు మంత్రులుగానున్న యాతడు రెండవ హరిహరరాయలే కాని మొదటి హరిహరరాయలు కాడు. ఈ కవినివాసముగా నెన్నబడుచున్న గ్రామము మోపూరు. నెల్లూరు మండలములో వెంకటగిరి తాలూకా యందు మోపూరున్నది. కాని యది ములికినాటిలోనిది కాదు.