పుట:శ్రీసూర్య శతకము.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందు తెలుగు పదము లున్నను - మూలమున నున్న పదస్వారస్యము లేదు. మూలమున జంభారాతీభకుంఠము ప్రత్యేకముగా ప్రారంభముననే చెప్పబడినది - ఆపద విశిష్టత యిందు లేదు - 'తొలు దెసహత్తి' కుంభము-అనగా తూర్పుదిక్కున గల యేనుగ - అని యర్థము వచ్చును. కానీ జంభారాతిని తొలుత తెలుపుటలో విశేషమున్నది. అతడు తూర్పుదిక్కున కధిపతి-స్వర్గమునకు నధిపతి-ఆతడు - సూర్యుని వలె ప్రాతఃకాలమున నైరావతము నెక్కి బయలువెడలును— ఐరావతము తెల్లనిదికావున సిందూరరేఖలు స్పష్టముగా భాసించును--ఇంద్రుడు సూర్యునివలె వైదిక వాఙ్మయమున ప్రస్తుతుడు-కవిత సులక్షణముగా నున్నదిగాని సరసముగా లేదు. ప్రస్తుతానువాదము - చూడుడు.

శా.జేజేరాయని కుంభి కుంభగతమౌ సిందూరముల్ తాల్చియో
యోజం జేగురుకాంతు లయ్యుదయ శై లోపాంతమం దంటియో
రాజీపప్రభ లేకకాలమున ప్రారంభించియో యెఱ్ఱనై
తేజుల్ గ్రమ్ము నవార్కఖాను లిడు నెంతే మీకు నైశ్వర్యముల్.

ఇందు మూలమునందలి ప్రతిపదము తెలుగులో నర్ధస్ఫురణతో నిలిచి, మనకు మూలశ్లోక భావము చక్కగా వివృతమై స్వతంత్ర రచనవలె భాసిల్లుచున్నది. మన ప్రాచీన కవులు సంస్కృత శ్లోకానువాదము చేసినప్పు డే పద్ధతి నవలంబించి, దానిని 'తెనుగు'గా చేసిరో శ్రీరాములుగారు నాపథకమునే యనుసరించిరి. పై పద్యమువలన శ్రీరాములు గారి యనువాదమున

  1. ప్రథమ విశిష్టత- తెనుగు దనము.
  2. రెండవది-భావవివృతి

మూలమున శ్లేషాద్యలంకారములతో నున్న భావములను తెలుగున విశదము చేయుట యిందలి మఱియొక విశేషము. ఈ సందర్భమున వ్యాసమూర్తి శాస్త్రిగారి, శ్రీరామ కవిగారి యనువాద విధానములను చూపిన పై యనువాదరీతి స్పష్టపడును.