పుట:శ్రీసూర్య శతకము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యశతకము - తెలుగు కవులు

మయూర కవి సూర్యశతకమును తొలుత తెలుగువారికి పరిచయము చేసినవాడు శ్రీనాథమహాకవి. అతడు కాశీఖండమున 15 శ్లోకములను నాంధ్రీకరించినాడు. భీమ ఖండమున శివరాత్రి మాహాత్మ్యమున మరి రెండు శ్లోకములను తెనుగు చేసినాడు. విశేష మేమనగా, సంస్కృతమున, మయూరకవి రచన యెంత ప్రౌఢమో, తెలుగున శ్రీనాథమహాకవి రచన - అంత ప్రౌఢముగా సాగినది.

సంపూర్ణానువాదములు

అద్యతన కాలమున - క్రీ. శ. 1893 నుండియు తెలుగున సంపూర్ణానువాదములు ప్రారంభమైనవి. ఈ క్రిందివారి యనువాదములు లభ్యమగుచున్నవి.

  1. ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి గారు (1893)
  2. వడ్డాది సుబ్బారాయుడుగారు--(1899)
  3. దాసు శ్రీరాములుగారు
  4. యామిజాల పద్మనాభస్వామిగారు
  5. చదలువాడ జయరామ శాస్త్రిగారు
  6. నేమాని సూర్యప్రకాశకవిగారు

వానిలో మూడవది యగు - దాసు శ్రీరామ కవీంద్రుని యనువాద విధానమును గూర్చి యీ పీఠికలో వివరించుచున్నాను.

ఈ యనువాదము క్రీ.శ. 1902లో ప్రకటితమైనది కాబట్టి సూర్యశతకానువాదములలో మూడవది. శ్రీరామకవిగారును, పై రెండనువాదములు పరిశీలించియే, తాము తిరిగి దీని ననువదించుటకు పూనుకొనిరి. వ్యాసమూర్తి శాస్త్రిగారు, గొప్ప సంస్కృతపండితులగుటచే, వారియనువాదము తెనుగు కాకపోయినది-వడ్డాది సుబ్బారాయడు గారు, సహజముగా కవులగుటచేత, సంస్కృత మూలమున గల గంభీరార్థములు తెలుగులోనికి రాలేదు-అందువలన శ్రీరామకవిగారు సూర్యశతకమే గాక, వ్యాఖ్యానములను పరిశీలించి మయూర కవి కృతిని పూర్వరీతిగా-అనువాదములు గాక-తెనుగు గావించిరి.