పుట:శ్రీసూర్య శతకము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ ఆంధ్ర సూర్యశతకమునకు మూలము సంస్కృతమున మయూర మహాకవి రచించిన సూర్యస్తుతి పరమగు శతకము1. అతిభయంకర మగు కుష్టు రోగముచే, దేహ మనసియున్న సమయమున ననవద్యమగు భక్తిప్రపత్తులతో సూర్యుని స్తుతించి, తనరోగమును బాపుకొనిన మయూరుడు, కవిత్వము సరా దింత మహత్త్వమున్నదని ప్రథమముగా లోకమునకు చాటినాడు. ఆతడు క్రీ. శ. 620 ప్రాంతమువాడు-ఈ పదమూడు శతాబ్దులనుండియు, సంస్కృత సాహితీ ప్రపంచమున-నాడును నేడును ప్రసిద్ధుడై యున్నవాడు.

మయూర కవివాగ్గుంభన మతిపౌఢమైనది - ఈ సూర్యశతకము కావ్య ప్రశస్తిని బడసినది- ఆనందవర్థనుడు మొదలుగా నాలంకారికు లెల్లడను దీని నుండి యుదాహరించిరి. దీనికి, పదునాలుగు వ్యాఖ్యలున్న పన్నచో దీని విశిష్టత తేటపడగలదు- ఇది ఖండాంతర భాషలలోను పరివర్తిత మైనది.

భారత వర్షమున, తక్కిన ప్రాంతముల కన్న ఆంధ్రదేశమున నీ సూర్యశతకము ప్రచుర ప్రచారము బడసినది. దీని వ్యాఖ్యాతలలో మువ్వు రాంధ్రులు- దీనిని ననుసరించి, సంస్కృతమున - వారణాసి ధర్మసూరి, లింగ కవి, చదలువాడ సుందరరామ శాస్త్రి - స్రగ్ధరావృత్తములతో శతకములు రచించిరి. సుప్రసిద్ధాంధ్ర దేశీయాలంకారికుడు, జగన్నాథ పండితరాయలు - సుధాలహరి దీనిననుసరించి స్రగ్ధరలలోనే రచించెను.

  • 1మయూరుని గూర్చి అతని సూర్యశతకమును గూర్చి విపులమగు పరిశోధనచేసి, "మయూరమహాకవి-ఆంధ్రవాఙ్మయము." అను గ్రంథము రచించితిని. అది ముద్రితము కావలసి యున్నది.