తా. ఇందు బాలసూర్యకాంతి బడబాగ్నితో నుపమింపబడినది. ఆరుణుని వలె, పగడముల భాతి ఎఱ్ఱనై, అచ్చటచ్చట నున్న చుక్కలవలె తెల్లనై, అల్ల నల్లన-నల్లనైన చీకటియను సముద్రమును త్రావు బాడబాగ్నివలె నొప్పు ప్రాతః కాల సూర్యతేజము, మీకు శోభాయమాన మగు గాక. [35]
ఉ. మద్దెల దిద్దిమల్ సరిగమా యను గీతులు గద్దెపద్దెముల్
గ్రద్దన దిద్దు వేలుపుల గాణలు తొల్లిటి సుద్దు లొద్దికన్
విద్దెలమారి వేల్పురుసి పెద్దలు సద్దిడ ముజ్జగానకుం
దద్దయు జవ్వనం బొసగు నవ్యరవిప్రభ మీకు మేలిడున్.
తా. గంధర్వులు మనోహరమలైన గద్యపద్యములతోడను, వేల్పుగాయకులు, మద్దెల ధ్వనులతోడను, ఇతర దేవతలు స్తుతులచేతను, నలరించు బాలసూర్యుడు జగంబులకు యౌవనం బొసగు గాత.[36]
ఉ. రిక్కలు పల్చనై తమము వ్రీలఁగ నిందు శిలాళి పాఱుటల్
తక్కఁగఁ జంద్రుఁడు న్మెఱుఁగు దప్పుట నోషధు లుక్కు వీడ నా
చక్కనిప్రొద్దు ప్రాఙ్నగము చక్కిని కొంచెము నిల్చియుండ ద
వ్వెక్కియు నెక్కకున్న దివసేశుని తేజము మిమ్ము బ్రోచుతన్.
తా. చుక్కలు పల్చనకాగా, చీకటి మాసిపోవగా, చంద్రకాంత శిలలు తప్ప చంద్రుడు కాంతిహీనుడు కాగా, ఓషధీలతలు, తమ జిగి వీడగా తూర్పు కొండ నెక్కియు, నింకను దీర్ఘముకాని బాలసూర్యకాంతులు మీకు సిరుల నొసగు గాత.[37]
చ. నవనవ యౌవనంబుల వనంబుల రక్తదడంబు డంబులన్
గవకవఁ జూపి చెంతలను గ్రంతలఁ గుంతల దాఁటి సాటి నా
కెవ రెవ రంచు దోడుపడు నీడకు చేడియతమ్మి దుమ్మురా
రవరవ నిక్క నెక్కు దినరాట్ ఛవి మీ కగుఁ బాపశాంతికిన్.
తా. వనములకు యౌవనము నొసంగి, ఎఱ్ఱనైన దశములకు నెఱ్ఱనికాంతి నిచ్చి, దగ్గఱగను, దూరముగను, మాటుచోటను నదిలేక, సమస్తజగంబును వెలిగించు సూర్యకాంతి మీకు పాపశాంతి చేయునుగాక.[38]