పుట:శ్రీసూర్య శతకము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విన్నాణంబుగఁ జూడఁజేసి భువనప్రేక్షం ద్వదాపత్తి వి
చ్ఛిన్నంబు న్సలుపు న్నవార్కరుచుల న్సిద్ధాంజన ప్రక్రియన్.

తా. కన్నీటివంటి మంచును తగ్గజేసి కన్నులలో గలుగు నెఱుపును హరింపజేసి, ఏ దోషములు లేకుండ భువనములను చక్కగా జూచుచు, సవిచ్ఛిన్నముగా సంచరించు సూర్యకాంతులు మీకు శోభను గూర్చుగాత. [32]

ఉ. ప్రొద్దుదయించు దిక్కుననుఁ బుట్టి నెలం గడుఁ దూల్చి యెఱ్ఱఁగా
దిద్దినయట్లు తోచి గడిదేఱు నవాబ్జము నట్టె లేపుచున్
దద్దయు ముజ్జగంబులకు దారొక సొమ్ములుగాఁ దలిర్చుచున్
ముద్దులుగుల్కు భానుకరముల్ విభవంబులు మీకుఁ జేయుతన్.

తా. ప్రొద్దుదిక్కున సుదయించి, చంద్రకాంతిని తగ్గించి, ఎఱ్ఱ యెఱ్ఱగా నొప్పుచున్న క్రొత్తతామరకు కమనీయత గల్పించి, మూడులోకములకు నెవడు భూషాయమాణు డగుచున్నాడో, అట్టి సూర్యుని కిరణములు మీపాపములు బాపుగాత.[33]

చ. పొలుపుగ ముజ్జగంబు లను పూవులతోఁటను బెంచు రాత్రి యన్
గులుకుమిటారి చంద్రుఁడను కుండను బ్రాఙ్నగచక్రవాళ మన్
చెలువపుబోది యన్ బగటిచెట్లకుఁ దానమృతంబు వోయని
మ్ముల మొలకెత్తు లేఁజిగురు ప్రొద్దుటియెండ ముదంబు మీ కిడున్.

తా. రాత్రియను కన్య మూడులోకము లను పూపుతోటను పెంచుటకై చంద్రుడను కుండను, తూర్పుకొండపై నిలిచి పగటిచెట్లకు అమృతము పోయుచున్నదో ఆమనట్లున్న లేతయెండ మీకు శుభము నిచ్చుత [34]

చ. అరుణుని యెఱ్టచాయ లెనయ న్బగడంబుల డంబు లొక్కటన్
మెరమెరఁ దారకాచ్ఛవి భ్రమింపఁగ ముత్యపుఁజాయ లొక్కట
న్సిరి గన నల్లనల్ల నగు చీఁకటిసంద్రము ద్రావునట్టి పూ
ర్వరవి నిభాత్యపూర్వబడబాజ్వలనం బిడు మీకుఁ బుణ్యముల్.