పుట:శ్రీసూర్య శతకము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. తెలతెలవారగా జాఱిపోవుచున్న వెన్నెలల తెలుపు రంగును, అప్పుడే వీడుచున్న చీకటి నలుపు రంగును, పద్మముల పుప్పొడి యందలి పసుపు రంగును, ప్రాతఃకాలమున గనుపట్టు, సూర్యకిరణముల ఎఱుపు రంగును, కలిపి జగమనెడు చిత్తరువును చిత్రించెడితూలికవలె నొప్పు బాల సూర్యకాంతి మీకు మేలొనగూర్చుత.[26]


ఉ. మేరునగంబుమార్గమున మించిన కెంపులధూళి లేచెనో
తేరునఁ దీర్చు పొంకముగ దిద్దిన యెఱ్ఱని పై జయంతియో
స్వారిగుఱాలు 'మేల్తొగరుచాయల జూల్కదలించునో యటం
చారయ నొప్పు బాలతపనాంశులు చోలుత మీకుఁ బాపముల్.

తా. మేరునగమునందలి కెంపులధూళిచేతనో రథమునకు గల ఎఱ్ఱని పతాకముననో, స్వారి గుఱ్ఱములు నెల్లని కాంతుల వలననో ఎఱ్ఱనైన ప్రొద్దుటి సూర్యకాంతులు మీకు శోభకలిగించుత [27]

ఉ. చీఁకటిఁ బుచ్చు వేడిమినిఁ జేయదు వెల్తురు నిచ్చు బెద్ద రూ
పై కనరాదు రే నడచునంతఁ బగ ల్వెలిగింపఁబోదు ప్రా
భాకర మైన బాలరుచిపాళియ పూర్ణము దిజ్ఞభోవకా
శాకలితంబె మీకు సకలార్థములన్ ఘటియించుఁ గావుతన్.

తా. చీకటిని ప్రోదోలును - అయినను, వేడిచేయదు, కావలసిన వెలుగునునిచ్చును. అట్లని పెద్ద ఆకారముతో నుండదు. రాత్రి నడపియు, పగలు వెలిగింపదు. ఆకాశము భూమియు, సమస్తమును వ్యాపించు, బాలసూర్యకాంతులు మీకు శ్రేయస్సు ఘటించు గాక.[28]

చ. చుఱుకయి శాంతిదంబు నలుసు న్విపులంబయి కానరాక యొ
క్కరికిని కానవచ్చియు జగంబున నిందున నుండి యందునున్
వఱలును నశ్వరం బయి యనశ్వరమౌ మునివేద్య మెల్లవా
రెఱిఁగియు నట్టి లోవెలుఁగు రెంటి యినప్రభ మిమ్ము నేలుతన్.