పుట:శ్రీసూర్య శతకము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా.ప్రళయకాలమున కొండలను పిండిచేయు గాలికి నారిపోవదు. ఉజ్జ్వలమైన కాంతిచే పగలంతయు వెలుగును. పతంగ సంభవమై, అఖండమై, వత్తిరేకయే సమస్త దీవులను వెలిగించు దీపమగు రవిదీప్తి మిమ్ము విరాజిల్ల జేయుగాక.[23]

 
చ. మొనయుచు నాశలెల్లఁ దుదముట్టెడి శ్లాఘ్యగుణాళి గౌరవం
బును నుదయాద్యహోగమ సమున్నతిఁ బర్యవసాన వర్జితం
బును గలదై క్షణంబునుఁ దమో నిచయంబునుఁ జేరఁబోక మే
ల్గనురుచివంటి భానురుచి జ్ఞాన దయాదులు మీకు నిచ్చుతన్.

తా. ప్రొద్దుటనుండి బయలుదేరి ఒకేరీతిగా దిక్కులన్నింటిని వెలిగించుచు, ముగింపు అనునది లేకుండ అందరు పొగడదగినటువంటి గుణ గౌరవముచే నొప్పుచు, క్షణమాత్రమున చీకటినెల్ల హరించు సూర్యకాంతి మీకు జ్ఞాన దయాదుల నిచ్చుగాక. [24]

చ. ప్రశమితతారకోర్జితబలం బగు శక్తినిఁ దాల్చి చంద్రకాం
త శిఖి నడంచి యయ్యతనుదర్పత మోహర విస్ఫుర న్మహో
తిశయిని యైన వీక్షణరతిం దగి రెండవ క్రౌంచభేది నాఁ
గుశలతఁ గాంచు భాసురుచికుఱ్ఱ యొసంగుత మీకు లక్ష్ములన్.

తా. ఇందు సూర్యతేజము కుమారస్వామితో పోల్చబడినది. కుమారస్వామి తారకాసురుని నణచినట్లు సూర్యకాంతి తారకల (చుక్కల) నణచును. చంద్రకాంతముల కాంతిని కుమారస్వామి ధిక్కరించును. సూర్యుడు చంద్రకాంతముల కాంతి తగ్గించును. ఈ రీతిగా సూర్యతేజస్సు కుమారస్వామిని పోలియున్నది.[25]

చ. తెలతెలఁ బాఱు వెన్నెలద్యుతిన్ రవచీఁకటి నల్లనల్లఁగాఁ
బలుచని తమ్మిపుప్పొడినిఁ బచ్చదనంబుల ప్రొద్దుపొర్పునం
గలననుఁ గెంపుచాయల జగం బను జిత్తరు వ్రాసినట్టి మే
ల్కల మగు భానుదీప్తి యతులప్రమదం బిడు మీదు చూడ్కికిన్.