తా. సమస్త భూప్రపంచమున గల, కొండలు, నదులు, నగరములు, ఏఱులు, సరస్సులు, వృక్షములు, గుట్టలు, పుట్టలు, ప్రకాశమానమైనట్లుగా చేసి, జగమనేడు పద్మమునకు నవ్యవికాసము గలిగించు, తరణి ప్రభ మిమ్ము ధన్యులుగా చేయు గాక [17]
శా. ఆస్తవ్యస్తుఁడు గాక నై జరుచియై యానంత్యముం గల్గి సం
గ్రస్త ధ్వాంతత విశ్వధామమున నేకత్రస్థ దీపంబు నా
నస్తోకంబుగ ముజ్జగాన దిగ నేహాపేక్ష నిత్య క్రియా
శస్తిం గ్రుమ్మఱు ప్రాఙ్నవార్కకిరణోచ్చైః కాంతిమేల్మీకగున్.
తా. అస్తవ్యస్తముగాక, ఏకాకారముగా, నిజకాంతులచే, అనంతమై చీకటి నెల్ల పోగొట్టి బ్రహ్మాండగేహమునకు నేకైకదీప మైన సూర్యకిరణాళి మీ కుచ్చైఃస్థితి గల్గించుగాక [18]
ఉ. వాడును దూఁడువంటి యహివర్గ మయో యని నాగలోకమున్
గూడక చక్రవాళమునకుం గల యాఖ్యకు నంచుఁ బ్రక్కలన్
వేఁడిమి యీకజాండమునఁ బెంకులు ప్రేలు నటంచు మింటిపై
నాడక స్వేచ్ఛఁ బోవ బయలైన యినప్రభ లేలు మిమ్ములన్.
తా. నాగలోకము వాడిపోవు నని పాతాళము చొరక చక్రములకు వేడిమిచూపక, బ్రహ్మాండకర్పరము పగులునో యని, మఱీ ఊర్థ్వముఖముగా వ్యాపించక, స్వేచ్ఛగా సంచరించు, సహస్రాంశుని అంశువులు మీ కానంద మిచ్చుగాక [19]
ఉ. కాలమొకండె కాదట జగంబును నీలిమఁబాయఁ జీకటుల్
వ్రీలఁగ మంచుకొండవలె రేవెలుఁగు న్విలయంబు నొంద సి
ద్ధాళికిఁ గేలు మోడ్పులటు లక్కు ముదప్రకరంబు బద్ధతన్
గ్రాల నొనర్చు ప్రాతరరుణప్రభ మీకునుఁ గోర్కెలిచ్చుతన్.