పుట:శ్రీసూర్య శతకము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. వేసవిలో బాటసారివలె, దాహముచే సముద్రోదకములన్నియు త్రావి ఆ నీటిని తిరిగి, వర్షరూపమున భూమి పై ప్రవహింపజేసి, ఆ నీటిశైత్యముచేత, హేమంతఋతువును గల్పించు, సూర్యాంశువులు మీకు శోభాయమానము లగు గాక [14]

చ. కలయ దిశావధూటులకుఁ గన్నులపండువుగాఁగ నస్ఫుటో
త్కలనను నూగునూగు టెఱ దాళువు సొంపులు నింప నుల్లస
న్నళినవిలోచనం బగు దినంబు మొగంబున మొల్చినట్టి మీ
సల నునురేకఁ బోలు దివసప్రభునంశులు మీకు మేలిడున్.

తా. దిక్కులనెడి స్త్రీలకు కన్నుల పండుగగా, దినముు మొదల నూనూగుకాంతులతో మొల్చు కిరణములను నూనూగు మీసాలవలె నలరింప జేయు నర్కుని బాలభానులు మీకు ప్రతిపత్తి కలిగించుగాక [15]

చ. తల నెలబాలుఁ డాలుగొనఁ దక్కు నితం డని శూలి నూతనా
కలిత సరోజగహ్వరసుఖస్థితికిన్ విధి చిమ్మచీఁకటుల్
వలె నలుపైన మేనికగు బాధకు భీతిలి కృష్ణ దేవుఁడున్
గొలుచు దినేశ సద్రుచుల క్రొమ్యొలకల్ మిముఁ బ్రోచు గావుతన్.

తా. ఏ సూర్యు డుదయించిన, తనతలపై నున్న చంద్రుడు కాంతి తఱిగి పోవునని శివుడు భావించుచున్నాడో. ఎవని కిరణములచేత తానున్న తామర పూవు గద్దె కడలిపోవునని, బ్రహ్మ భయపడుచున్నాడో, నల్లనిచీకటి అంతయు పోయినందున, నల్లని తనశరీర మేమగునో యని, కృష్ణుడు భ్రాంతిజెందుచున్నాడో, అట్టిసూర్యుని నూతన కరములు సంతసము కలిగించును గాక.[16]

ఉ. కొండకు విర్వియున్ దెసలకు న్నిడివంబులు వేలవేఱుగా
నుండుట వార్ధికిం గలుగ నుర్వినిఁ జెట్టులు వీండ్లు గట్టులున్
మెండుగఁ దోసఁ జీఁకటిని నెట్టి జగన్నళినీప్రబోధమున్
నిండుగ సల్పు బాలతరణిప్రభ మీకును గీడు వాపుతన్.