తా. కాళ్ళు, చేతులు, ముక్కు తెగి, మూలుగుతున్న రోగిని తానొక్కడే తనకిరణములచే చక్క జేయు కరుణాకరుండగు కంజహితుడు మీకు భద్రములు చేకూర్చుగాత.[6]
ఇచ్చట సూర్యకిరణ ప్రసారము వలన కుష్టరోగము నిర్మూలమగుట సూచితము. సూర్యశతకకర్త యగు మయూరుడు కుష్టవ్యాధి బాధితుడై సూర్యస్తుతి చేసి నిరామయుడయ్యెను. నేడును కుష్ఠరోగములకు, సూర్యకిరణ చికిత్స తప్ప వేఱు చికిత్స లేదు.
చ. తొలుతను గుజ్జులై పిదప దొడ్లయి యాదట భూనభోంతరా
కలితములై యనంతరము గ్రక్కున దిగ్దశకంబు ముట్టి య
బ్బలిదనుజేంద్రు నంటి యల ధ్వాంతము విశ్వమునుండి వాపి శ్రీ
చెలువుని దెప్పు నర్యముని చేతులు మీ దొసఁగుల్ హరించుతన్.
తా. మొట్టమొదట పొట్టివియై, క్రమముగా పొడుగై ఆవెనుక నాకాశము నాక్రమించి, దశదిశలు నిండి, ఆనాడు బలిచక్రవర్తిని నడగద్రొక్కిన త్రివిక్రముడగు విష్ణుమూర్తి వలె వ్యాపించిన సూర్యుని కరములు మీ పాపములను బాపుగాత.[7]
చ. ఆరుణుని కెంపుచాయల మహారుణిమున్ బహుళంబు చేసి య
య్యరదపు గుఱ్ఱముల్ మొగము లలన నెత్తిన నోళ్ల గళ్ళెపుం
గఱపుల ర క్తరోచులయి గట్లకుఁ గూటము లంటనెక్కి శే
ఖరతను గాంచి రేపు దివిఁ గ్రాలు నినప్రభ మీకు మేలిడున్.
తా. అరుణుని కెంపుదాయలకు నెక్కుడుశోభ గల్పించి, రథమునకు గట్టిన గుఱ్ఱములనోళ్ళ నున్న కళ్లెములవలన దవడల చివరలు తెగి రక్తము వలె, నెఱ్ఱనై ఆకాశ వీధి విహరించు సూర్యాంశువులు మీకు సుఖ మిచ్చుగాత. [8]