పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


శంకరుచాపంబు ఖండించి జానకిఁ
        జేఁబట్టి భార్గవుఁ జెలఁగి యతని
బల మాఱ్చి సాకేతపట్టణంబును జేరి
        జనకునానఁతి గొని చని యరణ్య
వాసంబు సేయ రావణుఁ డనుదైత్యుండు
        లలన సీతను దనలంక కెలమిఁ


తే.

బట్టి కొనిపోవ రామభూపాలకుండు
రావణుని ద్రుంచుకొఱకు సుగ్రీవుఁ జేరి
యాంజనేయాదికపులతో నపుడు వేంక
టాద్రి చెంతను లంకకు నరుగుచుండ.

212


శ్రీరాములు వేంకటాద్రికి వచ్చుట

తే.

అంజనాదేవి శ్రీవేంకటాద్రిమీఁద
నుండి రాముఁడు కపిపుంగవులను గూడి
వచ్చుటం జూచి యెదురుగ వచ్చి యతని
పాదకమలంబులకు మ్రొక్కి భక్తి మెఱయ.

213


క.

ఘనుఁ డగురాముఁడు విష్ణుం
డని మనమున నిశ్చయించి యానందముతో
వినుతులు సేయుచు మఱి యి
ట్లని రాముని కీర్తి యవనియం దలరంగన్.

214


ఉ.

రామ సుకీర్తికామ ఘనరాక్షసబృందవిరామ సద్గుణ
స్తోమ దినాధినాథకులతోయధిచంద్రమ శౌర్యధామ నీ
శ్రీమహితప్రభావము ధరిత్రి నుతింపఁగ నాకు శక్యమే
కామఫలప్రదాత ననుఁ గావఁగదే జగదీశ రాఘవా.

216