పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


తే.

సకలపాపహరం బయి సంతతార్థ
ములును బొందెదు మఱి చింత తొలఁగు నీకు
ననఁగ నావిప్రుఁ డాశ్చర్య మంది నిద్ర
మేలుకొని యిట్లు తలపోసె మెచ్చుకొనుచు.

198


తే.

తలఁచె నిమ్మెయి శ్రీరమాధవుడు స్వప్న
మున వచించినగతి నిప్డు పుష్కరాద్రి
జేరి తీర్థంబులను గ్రుంకి కోరినట్టి
కోర్కె లెల్లను బొందెదఁ గుతలమునను.

199


వ.

అని యెంచి కపిలతీర్థాది సప్తదశతీర్థంబులయందు విధిప్రకా
రంబుల స్నానంబు సేసి సకలాభీష్టంబు లొందె నని వెండియు
సూతుం డిట్లనియె.

200


తే.

మునివరేణ్యులు తీర్థాలు మూఁడుకోట్లు
తనరు నీవేంకటాద్రిపై ధరణి వేఱ
చోటలే దెందుఁ గావునఁ జూకు రడఁగు
తాతకైనను వర్ణింపఁ దరము గాదు.

201


వ.

మఱియు నివ్వేంకటాద్రి నొకతూరి సద్భక్తిం బ్రదక్షిణంబు
సేసిన వారికి మాతృప్రదక్షిణతుల్యం బగుటం గాక భూ
ప్రదక్షిణంబు వలనం గల్గుఫలంబుకంటె ననంతఫలంబు సిద్ధించు
నిదియునుం గాక యొక విశేషంబు గల దదియెట్లన మున్నొక
సమయాన హలాయుధుండు వేంకటాద్రిశిఖరదర్శనంబు చేసి
సకల తీర్థాదులం దలంచి యనుపమసుకృతంబు గాంచె. నింతి
య గాక ధర్మరాజాదు లరణ్యవాసము చేయుచుండ నొక
నాఁడు శ్రీకృష్ణుండు వచ్చి పాండవుల కిట్లనియె.

202