పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

47


సీ.

దేవదేవమహాత్మ దీనరక్షక జగ
        న్నాథ సత్కరుణతో నన్నుఁ జూడు
మునుపు మాపూర్వుల కొనర మీ రిచ్చిన
        పృథ్వి శాత్రవుల కొప్పించి వచ్చి
యతీదీనదశ నొందినట్టి నా కిప్పుడు
        ప్రత్యక్ష మైతివి పరమపురుష
నాశత్రువులఁ ద్రుంచి నారాజ్య మిప్పించు
        మనిన శ్రీహరి శంఖణునికి ననియెఁ


తే.

జింత విడువుము రాజు నీసీమఁ జేరి
పట్టభద్రుఁడ వైయుండు భార్యతోడ
ననుచు నభయంబొసంగి చక్రాయుధుండు
తగ సురుల్మెచ్చి గనఁ దిరోధానుఁడయ్యె.

164


తే.

అప్పు డాబ్రహ్మముఖ్యులు హరి నుతించి
స్వామిపుష్కరిణీస్నానసత్ఫలంబు
పొగడ శక్యంబె యనుచు నాభూరమణుని
భక్తికి న్మెచ్చు చేగిరి భాగ్య మనుచు.

165


ఆ.

శంఖణుండు భక్తి స్వామిపుష్కరిణికి
మ్రొక్కి శైలమునకు మ్రొక్కి హరికి
మ్రొక్కి భార్యతోడ ముదమున గిరి డిగ్గి
పోవుచుండ నతని భూమియందు.

166


క.

విమలుం డగుశంఖణరిపు
లమితాశనురాజ్య మేల నన్యోన్యవిరో
ధము లెసఁగఁ బోరి మడిసిరి
క్రమముగ నమ్మహికి రాజు గావలె నంచున్.

167