పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


బులు శ్రీమద్వేంకటాచలనివాసుని ధ్యానంబు చేయుచుండె
ననంతరంబు.

161


శంఖణరాజుకు వేంకటాచలపతి ప్రత్యక్షంబగుట

సీ.

హారకుండలకిరీటాదిభూషణభర్మ
        చేలకాంతులఁ బ్రకాశించువాఁడు
తులసీసుదళపరిమళపుష్పహారవి
        రాజితసూక్షోదరంబువాఁడు
తిలకాంతనిటలప్రదేశమందు నటించు
        కమనీయకుటిలాలకములవాఁడు
శ్రీవత్సకౌస్తుభచిహ్నము ల్గలవాఁడు
        కరుణ నొప్పిన గొప్పకనులవాఁడు


తే.

శంఖచక్రగదాబ్జహస్తములవాఁడు
సరవిలక్ష్మినిఁ జెలఁగు వక్షంబువాఁడు
భూమినీళలఁ గెలఁకులఁ బొల్చువాఁడు
దీనజనపాలుఁ డఖిలైకదేవుఁ డపుడు.

162


వ.

రవికోటిప్రకాశ సదృశ దివ్యవిమాన మధ్యప్రదేశమునం
దుండి స్వామిపుష్కరిణిమధ్యంబున నిలిచి శంఖణమహా
రాజుకుఁ బ్రత్యక్షంబుగాఁగ నయ్యెడ బ్రహ్మరుద్రేంద్రప్రము
ఖులు వచ్చి భేరిమృదంగాదిమంగళవాద్యంబులు మ్రోయ
పుష్పవృష్టి గురియించి నృత్తగీతంబులు గావించి నిగమాంత
సూక్తంబుల సన్నుతించుచుండి రంత శంఖణమహారాజు
ప్రసన్నుం డైన శ్రీహరికి సాష్టాంగదండప్రణామంబు లాచ
రించి కరంబులు మోడ్చి సద్భక్తి మెఱయ నిట్లనియె.

163