పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

468

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


సీ.

ఘనపాంచరాత్రప్రకారంబుగా నిన్నుఁ
        బూజించు నచటికే పొమ్మటంచుఁ
బలికి పంపింపఁగఁ బాతాళమందున్న
        శేషుండు లక్ష్మి నీక్షించి మ్రొక్కి
బహురత్నవిలసితాభరణాంబరంబులు
        చందనసుమదామచయము లొసఁగి
రమణీయమగు దివ్యరథములోఁ దగు సహ
        స్రారహేమాబ్జంబునందు వెలుఁగు


తే.

కర్ణికాపీఠమున నుంచి గజచతుష్ట
యంబుతో వీడుకొల్ప నయ్యాదిలక్ష్మి
సంతసింపుచు మధ్యాహ్నసమయమునకు
ధరణి భేదించుకొనుచు మోదమున వచ్చి.

187


తే.

మహిమతో నూటయెనిమిదిమంది సేవ
కాజనంబులు గొల్వఁగ ఘనత మెఱయ
శేషపర్వతమునకు దక్షిణముగాను
గలుగు స్వర్ణముఖరికిఁ దద్భాగమందు.

188


సీ.

ఘనతరంగయుతంబు గంగోపమానంబు
        నలినకైరవకోకనదయుతంబు
భాసురమకరందపానమత్తమిళింద
        పటలవిహారంబు పావనంబు
మత్స్యకచ్చపభేకమకరకుళీరక
        ప్రాతనివాసంబు శీతలాంబు
పూర్ణమలఘుసోపానావృతంబును
        స్వాదుగంధాఢ్యమై జగతి మీఱ