పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

449


తే.

జక్రధరుఁ డుంచుకొనియె నాసమయమునను
వారిశిరములపైఁ బుష్పవర్షములను
దొడరి గురియించి దేవదుందుభులు మొరయఁ
జేసి హరిచెంత జిష్ణుఁడు చేరి మ్రొక్కె.

134


సీ.

ఆడిరి రంభాదు లంబరంబున నిల్చి
        పాడిరి గంధర్వపతులు సతులు
తుంబురునారదాదులు వీణ మీటి గా
        నములు చేసిరి కడునయము మెఱసి
కశ్యపాదిమునీంద్రఘనులు వేదాంతర
        సూక్తులఁ బొగడిరి భక్తవరులు
మఱి గొనియాడిరి మాన్యతగా గిరి
        జాసరస్వతు లొగి భాసురముగ


తే.

మంగళారతు లిచ్చిరి మంగళమని
శంకరుండును బ్రహ్మయు సదమలాత్ము
లగుచు సేసలు చల్లిరి యమరవరులు
కీర్తిఁ బ్రకటించు చెలమి మ్రొక్కిరి దొడంగి.

135


వ.

అప్పుడు విష్ణుం డానందసుధాంబుధి నోలలాడుచు నిజరథంబు
నెక్కి శ్రీకాంతతో శ్రీవేంకటాచలారోహణంబు సేయుచుండె,
నాసమయంబున బ్రహ్మేంద్రాదు లాలక్ష్మి యుదయించిన
పద్మసరస్సునం దీకార్తీకశుద్ధపంచమిదినంబున జనులు
స్నానంబు చేసిరేని వారలకు లక్ష్మీకటాక్షంబు గల్గు నని
తత్తీర్థంబునం దాము మునింగి యాస్వామి వెనువెంట నరిగిరి.
శ్రీస్వామి వరాహస్వామియనుమతంబుస విష్వక్సేనాదిపరమ
భాగవతు లలంకరించియున్న నిజనివాసము చేరె నప్పుడు