పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటాచలమాహాత్మ్యము

449


సీ.

భాసుర నాసికాభరణంబుతోఁ గూడి
        బింబాధరముకాంతి పిక్కటిల్లఁ
దీరగు కస్తూరితిలకంబుతోఁ గూడి
        నిటలతటద్యుతుల్ నివ్వటిల్ల
నెలవంక బొమలును నేత్రాంజనము సరి
        గా సొగ పై నీలకళల నీనఁ
బరిమళగంధలేపనముతో నెనసి స
        త్కుసుమసౌరభము దిక్కులను నెఱయ


తే.

హంసగతి నొప్పు నుదధిదుగ్ధాబ్ధినుండి
వెడలి మునువచ్చి హరి చేరు విధముగాను
రమ్యతరమైన పద్మసరస్సు వెడలి
శ్రీరమాసతి పతిచెంతఁ జేరి నిలచి.

132


క.

మును తనకు నివాసంబై
తనరెడు హరి యురమునందుఁ దనకరములఁ జు
దన మలది మోహముం దగ
మనమున భక్తియు నెసంగ మాన్యత మెఱయన్.

133


సీ.

తులసీదళంబులు దూర్వాంకురంబులు
        మల్లెపూవులును జేమంతిపూలు
మొల్లలుతోఁ గడు మోదంబు దనరు పూ
        దండ యొక్కటిఁ గట్టి తనివిఁ దీరఁ
గరములతో నెత్తి కంకణంబులు మ్రోయ
        హరికంఠమం దుంచి యచట నిలిచి
యున్న లక్ష్మిం జూచి మన్ననఁజేసి తా
        హస్తంబునంబట్టి యల యురమునఁ