పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

447


చ.

వనజజ శంభులిద్దఱును వార్ధితనూభవమోము చూచి త
న్మనమున నుండునట్టి యనుమానము తాము గ్రహించి పద్మలో
చనునకు మ్రొక్కి యిట్లనిరి సాగరకన్యక నెత్తి వక్షమం
దొనరఁగ నుంచుకొమ్ము హరి యోజగదీశ యటంచుఁ బల్కఁగన్.

128


చ.

విని హరి నన్వి యిట్లనియె వింతగఁ జూచుచు నుండనేల న
వ్వనధిజ కెల్లకాలము నివాసముగాఁ దగినట్టి నాయురం
బున నిఁకనైన నిల్వుమని పొందుగఁ జెప్పుడు మీర లిప్పు డ
న్నను విధి రుద్రులిద్దఱు మనంబున సంశయ మొంది తాల్మితోన్.

129


తే.

పలికి రిట్లని దేవి నీప్రాణవిభుని
పక్షమునఁ జేరి యుండఁగ వలయు నిపుడు
మంచిలగ్నంబు గనుక నెమ్మదిగఁ జేరు
నునఁగ నంభోధికన్య ప్రియంబు మెఱసి.

130


సీ.

ఘల్లుఘల్లని కాళ్లగజ్జ లందెలు మ్రోయ
        మొలనూలు గజ్జె లిమ్ముగను మెఱయఁ
జెలువారు పసిఁడియంచులనొప్పు తెల్లని
        చీర నద్దపుఁగాంతి చెన్ను మీఱ
రహిని చందురుకావి రవికెను బంగరు
        గిండ్లి భంగిగను బాలిండ్లు తనరఁ
జారుకొప్పునఁ బూలసరులు సొంపును జూప
        ముంగురుల్ నుదుటను మురువుఁ దెల్పఁ


తే.

గర్ణకంఠాభరణకరకంకణములు
వరశిరోభూషణంబులు సురుచు లెసఁగ
మందహాసంబు సేయుచు మహితవినయ
ధన మొసంగుచుఁ జూచుచుఁ దనువు మెఱయ.

131